కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గాను ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం విదితమే. అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్న కరోనా తీవ్రతను బట్టి పలు సడలింపులు ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం 20వ తేదీ నుంచి అత్యవసరం కాని (నాన్ ఎసెన్షియల్) వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించుకునేందుకు ఈ-కామర్స్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈ-కామర్స్ సంస్థలు యథావిధిగా లాక్‌డౌన్‌ను పాటించాల్సి ఉంటుంది. నాన్ ఎసెన్షియల్ వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించకూడదు.
కేంద్ర హోం శాఖ ఈ-కామర్స్ సంస్థలకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. మే 3వ తేదీ వరకు.. లాక్‌డౌన్ సమయంలో నాన్ ఎసెన్షియల్ వస్తువుల విక్రయంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకు ముందు అందుకు అనుమతి ఇచ్చినా.. ఇప్పుడు దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఆ అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అత్యవసరం అయితే వస్తువులను మాత్రం ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చని ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం తెలిపింది.
కాగా ఏప్రిల్ 20వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఉండే కరోనా కేసుల సంఖ్య, తీవ్రతను బట్టి కేంద్రం ఇప్పటికే పలు సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే తెలంగాణలో సీఎం కేసీఆర్ ఈ విషయంపై ఆదివారం నిర్ణయం తీసుకోనున్నారు.