అమెరికా అధ్యక్షుడు తన వైఫల్యాలను పక్కవారిపై తోసేసే ప్రయత్నాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. కొవిడ్-19 వ్యాప్తిపై చైనాకు వత్తాసు పలుకుతోందన్న అభిప్రాయంతో ప్రపంచ ఆరోగ్య సంస్థపై గుర్రుగా ఉన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రకటించారు. చైనా నుంచి వచ్చిన తప్పుడు సమాచారాన్ని చేరవేసి భారీ సంఖ్యలో కరోనా మరణాలకు కారణమయిందని ఆ సంస్థపై మండిపడ్డారు. చైనా నుంచి రాకపోకలపై జనవరిలో నిషేధం విధించడాన్ని తప్పుబట్టిన WHO , చైనాలో కరోనా వ్యాప్తిపై అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిందని, దానిపై తన సమీక్ష పెండింగ్‌లో ఉన్నందున నిధులు ఆపేస్తున్నామని ట్రంప్ విస్పష్టంగా ప్రకటించారు.
గత కొన్ని వారాలుగా, కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేయడంలో దారుణంగా విఫలమయ్యారని దేశమంతా కోడై కూస్తోంది. ఈ మధ్య జరిపిన సర్వేలలో కూడా అమెరికన్లు ట్రంప్ నిర్లక్ష్యవైఖరిని విమర్శించారు. ఇవన్నీ ఇలా ఉండగా, నిన్న మంగళవారం, తన పరిపాలనా విభాగాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు సమకూర్చడం నిలిపేయాల్సిందిగా ఆదేశించారు. కరోనా వ్యాప్తిపై WHOఎప్పుడు, ఎలా స్పందించిదనేదానిపై తాము ఇంకా సమీక్ష జరపాల్సిఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
మొన్నటికి మొన్న, చైనా కరోనాను అద్భుతంగా కట్టడి చేస్తోందని కతాబిచ్చిన ట్రంప్, నాలుకను పలుమార్లు మడతేసాడు. అమెరికా ప్రస్తుతం అనుభవిస్తున్న నరకయాతనకు ప్రత్యక్షంగా తానే కారణమైనప్పటికీ, ప్రతిపక్షాలను, గవర్నర్లను, మీడియాను ఆఖరికి, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా తిట్టిపోసాడు. దేశంలో పరీక్షా సామర్థ్యం తక్కువగా ఉండటానికి తాను బాధ్యత వహించబోనని కూడా మార్చిలో తేల్పిచెప్పాడు.
నిజానికి డిసెంబర్ 31 న చైనాలోని వుహాన్‌లో తలెత్తిన వైరస్ గురించి సంస్థకు తెలిసింది. ఆ మర్నాడే తమకు మరిన్ని వివరాలు పంపాల్సిందిగా చైనా అధికారులకు WHO విజ్ఞప్తి చేసింది. ఎప్పుడైతే మరణాలు 10 వేలకు చేరాయో, కరోనాను ‘‘ప్రపంచ మహమ్మారి’’గా ప్రకటించింది. ఇది జనవరి 30న జరిగింది. అయితే ముందుగా కరోనా శక్తిని, ప్రభావాన్ని సంస్థ అంచనా వేయలేకపోయింది. పూర్తిగా చైనా ఇచ్చిన సమాచారాన్ని ప్రాతిపదికగా చేసుకునే, ప్రపంచానికి సూచనలివ్వడం మొదలెట్టింది. WHOతన స్వంత నెట్‌వర్క్‌ను వాడిఉంటే, కొవిడ్-19 గురించి అసలైన విస్తృత సమాచారం లభించిఉండేది. కేవలం ట్రంప్ మాత్రమే కాక, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు కూడా చైనా సమాచారం నమ్మదగింది కాదని ఆరోపించారు. ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకున్న ట్రంప్, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు WHOను విజయవంతంగా బలిపశువుగా మార్చగలిగాడు.
అమెరికా దేశంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ లేని కారణంగా, కుప్పలుతెప్పలుగా పెరిగిపోతున్న కరోనా కేసులను కట్టడి చేయడం ప్రయివేటు ఆసుపత్రులకు, హెల్త్ క్యాంపులకు సాధ్యం కావడంలేదు. ప్రపంచవ్యాప్తంగా నేటికి 20 లక్షలకు పైగా పాజిటివ్ కేసులతో, లక్షా 27వేలకు పైగా మృతులతో లోకం అల్లాడుతోంది. అమెరికాలో 6 లక్షలకు పైగా కేసులు, 26వేల మృతులతో కరోనా కరాళనృత్యం చేస్తోంది.
కాగా, ట్రంప్ నిర్ణయాన్ని డెమొక్రాట్లు వ్యతిరేకించారు. ఇది ‘పనికిమాలిన చర్య’గా వారు అభివర్ణించారు. అలాగే, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటెనియో గుటెరస్, అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టారు. కరోనాపై విజయం సాధించాల్సిన ప్రస్తుత సంక్షోభ సమయంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరముందనీ, నిజాలను అధ్యయనం చేయడంలో సంస్థల మధ్య భేదాలుండటం సహజమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తుందని తెలిసిందే.
ప్రతి రెండేళ్లకోసారి ఉండే సంస్థ బడ్జెట్ దాదాపుగా 600 కోట్ల డాలర్లు కాగా, ఇదంతా సభ్యదేశాలు సమకూర్చాల్సిఉంటుంది. పోయినసారి అమెరికా 55 కోట్ల డాలర్లు తన వంతుగా ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.