గతకొన్ని రోజులుగా టీడీపీ నాయకులకు కేటాయించిన ఖదీ నెంబర్ల గురించిన ఆన్ లైన్ లో సెర్చ్ లు.. అనంతరం వాటిపై చర్చలూ ఎక్కువగా జరుగుతున్నాయి. అచ్చెన్నాయుడికి ఏ నెంబరు కేటాయించారు… జేసీ కి ఏ నెంబరు కేటాయించారు అనేదానిపై కొందరు యువత ఆసక్తి చూపుతున్నారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టేస్తున్నారు!! ఈ క్రమంలో తాజాగా ప్రైవేటు బస్సుల లైసెన్సుల ట్యాంపరింగ్.. బీఎస్ సర్టిఫికెట్ల గోల్ మాల్ వ్యవహారంలో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను కడపలోని సెంట్రల్ జైల్ కు తరలించిన సంగతి తెలిసిందే!
కడప కేంద్ర కారాగారంలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలకు ఖైదీ నంబర్లను కేటాయించారు అధికారులు. జేసీ ప్రభాకర్ రెడ్డికి 2077 కేటాయించగా ఆస్మిత్ రెడ్డికి 2078 నంబర్ ను కేటాయించారు. 14 రోజుల రిమాండ్ తో వీరు కడప సెంట్రల్ జైలులోనే ఉండనున్నారు. ముందుగా అనంతపురం జైలు అనుకున్నా… అక్కడ ఒక ఖైదీకి కరోనా ఉండటం వల్ల కడపకు తరలించినట్లు తెలుస్తుంది! 14రోజుల రిమాండ్ ముగిసిన అనంతరం మళ్లీ అనంతపురం తీసుకెళ్లి కోర్టులో హాజరుపరుస్తారు. అప్పుడు కూడా బెయిల్ రానిపక్షంలో మళ్లీ కడపకే తీసుకొస్తారని అంటున్నారు.
కాగా… మొన్న 1573 – నిన్న 2077 – రేపు ఎంత? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వైకాపా శ్రేణులు! ఈ అరెస్టుల పర్వాలు ఇప్పట్లో ఆగే పరిస్థితులు లేవనే హింట్లు వస్తున్న తరుణంలో… ఖైదీ నెంబర్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి!