సోమవారం ఈ కథ చదివితే శివానుగ్రహం తప్పక లభిస్తుంది!

-

సోమవారం ఈ కథ చదివితే.. కార్తీకంలో శివారాధన ఎంత ముఖ్యమో శివభక్తుల చరిత్రను గుర్తుచేసుకోవడం లేదా చదవడం కూడా ముఖ్యమే. శివభక్తుల చరిత్రను తెలుసుకున్నా, మననం చేసుకున్నా శివానుగ్రహం శ్రీఘ్రంగా లభిస్తుందని పురాణాలు పేర్కొన్నాయి. ఇక శివభక్తుల గురించి తల్చుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది. పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్నీ, అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలనీ పెంచేందుకు మార్కండేయుడి కథను ఆదర్శంగా చెబుతారు. ఈ కార్తీక మాసాన ఆ మార్కండేయుని కథ మరొక్కసారి….

పూర్వం మృకండుడు అనే రుషి ఉండేవారు. మృకండుడు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట. అలాంటి మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు. వారికి పిల్లలు లేరు! సంతానభాగ్యం కోసం వారిద్దరూ వారణాశి క్షేత్రానికి చేరుకుని శివుని పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు. కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో మీకు తప్పకుండా పుత్రసంతానాన్ని ప్రసాదిస్తాను. కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా? అని అడిగాడు. వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమేం, మాకు గుణవంతుడైన అల్పయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకండుని దంపతులు. అచిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖలాంటి ఓ బాలుడు కలిగాడు. మృకండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకలగుణాభిరాముడు! బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టాడు మార్కండేయుడు. మరో పక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఓసారి మృకండుని ఆశ్రమానికి సప్తరుషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్షు తీరనుందని వారికి అర్థమైంది.

How to please Lord Shiva on Monday to fulfil your dreams
How to please Lord Shiva on Monday to fulfil your dreams

మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తరుషులు. మార్కండేయుని చూసిన బ్రహ్మ, అతడిని నిరంతరం శివారాధన చేస్తూండమని సూచించాడు. అందరూ కలిసి, శివనామస్మరణ చేత అకాలమృత్యవు దరిచేరదని మార్కండేయునికి తెలియచేశారు. పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒకపక్క అతని మృత్యుఘడియలు సమీపిస్తున్నాయి. మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరికదా ఒకో నిమిషం గడిచేకొద్దీ మరింత జోరుగా సాగుతోంది. యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయల్దేరారు యమభటులు. కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా! అతని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి, యమపాశాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు. ఆ ధ్యానాన్ని ఆపి ఇవతలికి రా! నీ మృత్యువు సమీపించింది అని హుంకరించాడు యముడు. కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు ఇవతలికి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు.

ఇక యమునికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆఖరి ఆస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు. తన మీదకీ, తన భక్తుని మీదకీ పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్కపెట్టున సంహరించాడు. ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే బిరుడు వచ్చింది. అంటే కాలాన్ని/మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం. కానీ యుముడే లేకపోతే ఈ లోకంలో చావుపుట్టుల జీవనచక్రం ముందుకు సాగేదెలా! అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు. అయితే మార్కండేయుని జోలికి అతను ఇక రాకూడదనీ, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదనీ హెచ్చరించి వదిలివేశాడు పరమేశ్వరుడు. ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయూర్‌ అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం. కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి. మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా, అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు. శివకేశవుల లీలలే కాకుండా దేవీమాహాత్మ్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news