వైసీపీలో కాక పుట్టించే రాజకీయ చర్చ ఒకటి బయల్దేరింది. సీఎం, మంత్రులు కేంద్రంగా ఈ చర్చ నడుస్తోంది. సీఎం జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దవుతుందని జోరుగా ప్రచారం సాగుతుండగా..అంతకంటే జోరుగా సీఎం రేసులో నేనంటే నేనంటూ కొంతమంది సీనియర్ మంత్రులు తమకు అత్యంత సన్నిహితులైన వారివద్ద, తమ గ్రూపులో ఉన్న ఎమ్మెల్యేల వద్ద చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరో అంటూ రాజకీయ ఆలపానలు చేస్తూ గౌరవం పొందే ప్రయత్నం చేస్తున్నారట.
సీఎం అనేది ప్రతీ రాజకీయ నాయకుడి కల…సీఎం కావాలనుకోవడంలో తప్పేముంది.. అంటూ గతంలో మీడియా ఎదుట బాహటంగా వ్యాఖ్యనించిన ఉత్తరాంధ్రాకు చెందిన ఓ సీనియర్ మంత్రి రేసులో తాను ముందుంటానని తన గ్రూపు ఎమ్మెల్యేల వద్దకు చెప్పుకుంటున్నారట. ముఖ్యమంత్రి కావాలనేది నా కోరిక. అది ఈ జన్మలో తీరదేమో అనుకున్నా…వైఎస్ జగన్ బెయిల్ రద్దవుతుందనే ప్రచారం నేపథ్యంలో తన చిరకాలవాంఛ అయిన సీఎం సీటు దక్కించుకునే ఛాన్స్ ఎలాగైనా వదులుకోకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నారట.
అలాగే తానే నెంబర్ 2గా కొనసాగుతున్న హైలీ రెస్పెక్టెడ్ కోటాతో పాటు సీనియర్ అయిన మంత్రి పెద్దిరెడ్డి త్వరలో తానే సీఎంని అని ప్రచారం చేసుకుంటున్నారట. తన తనయుడు మిథున్ రెడ్డి ఢిల్లీలోనూ తన తండ్రి సీఎం కావడానికి అనువుగా పావులు కదుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇంటా..బయట జరుగుతున్న రాజకీయ పరిణామాలను బాగా పరిశీలిస్తున్న జగన్మోహన్‌రెడ్డి ఎక్కడా తన అధికారానికి భంగం కలగకుండా తన ప్లాన్లతో తాను బిజీగా ఉన్నట్టు కూడా సోషల్ మీడియా, మీడియా సర్కిల్స్‌లో గుసగుసలు వస్తున్నాయి.
అందుకే ఒకవేళ బెయిల్ రద్దయి తాను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులే వస్తే తన భార్య భారతిని సీఎం కూర్చీలో కూర్చోబెట్టి వెళ్లాలన్నది ఆయన వ్యూహాంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. భార్య భారతి అయితే అన్ని రకాలుగా తనకు సేఫ్‌గా ఉంటుందని యోచిస్తున్నారట. అందకే ఆమెకు పలు కీలక శాఖలపై అవగాహన కల్పించడంతో పాటు పాలనాపరంగా, పార్టీపరంగా అన్ని వ్యవహారాలపై పూర్తిగా అవగాహన కల్పించే శిక్షణ ఇస్తున్నారని సమాచారం. మరి మీడియాలో విస్తృతంగా జరుగుతోన్న ఈ ప్రచారంలో అసలు వాస్తవ, అవాస్తవాలు వాళ్లకే ఎరుక..?