కార్తీకంలో శ్రీశైల దర్శనం ! ఈ యాగం చేసిన ఫలితం !

-

కార్తీకం అంటేనే శివకేశవుల మాసంగా ప్రతీతి. అందులోనూ శివాభిషేకాలు, ఉపవాసాలు, శైవ క్షేత్రాల సందర్శన, దీపారాధనలు, దానలకు ఈ మాసం నెలవు. అలాంటి ఈ పరమ పవిత్రమాసంలో శైవక్షేత్రాలను సందర్శిస్తే కలిగే ఫలాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ద్వాదశ జ్యోతిర్లంగాలలో ఒకటిగా, అష్టాదశ పీఠాలలో ఒకటిగా వెలసిన అద్భుత క్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రాన్ని కార్తీకమాసంలో దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం…

శ్రీశైలంలో పరమేశ్వరుడు మల్లికార్జున మహాలింగమూర్తిగా, పార్వతీదేవి భ్రమరాంబగా, గణపతి సాక్షిగణపతిగా, సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖునిగా, వీరభద్రస్వామి క్షేత్రపాలకుడిగా, నంది శనగల బసవన్నగా, గంగ పాతాళ గంగగా సమస్త మునులు వృక్షాలుగా, ఆ కైలాసమే భూమిపై అవతరించిందా అన్నట్లు దర్శనమిచ్చే ప్రదేశం శ్రీశైలం. అందుకే ఇది ఇలకైలాసంగా ప్రసిద్ధికెక్కింది.

కార్తీకంలో శ్రీశైల దర్శనం !

శ్రీశైలాన్ని దర్శించడం ఒక యజ్ఞం ఆచరించిన ఫలితాన్నిస్తుందని, ఈ క్షేత్రాన్ని ఒక్కో మాసంలో దర్శిస్తే ఒక్కో ఫలితం లభిస్తుందని శ్రీపర్వతపురాణం చెప్పింది. కార్తీకమాసాన శ్రీశైలదర్శనం అతి గొప్పదైన వాజపేయ యాగాన్ని చేసిన ఫలితాన్ని ఇస్తుందని కూడా అదే పురాణం చెప్తోంది. కార్తీకమాసంలో శ్రీశైలఆలయంలో జరిగే కైకర్యాల గురించి తెలుసుకుందాం.

నిరంతర శివ భజన

కార్తీకమాసం ప్రారంభమైనరోజే ఆలయంలో నిరంతర శివనామభజన ప్రారంభమౌతుంది.ఈ మాసమంతా, ఇరవైనాలుగు గంటలూ వీరశిరోమండపం వద్ద శివనామస్మరణతో భజన కొనసాగుతూనే ఉంటుంది.

సోమవారం… సేవలతోరం

కార్తీక సోమవారం క్షేత్రమంతా భక్తులతో కిటకిటలాడుతుంటే, ఆలయంలో అనేక ఉత్సవాలతో స్వామి అమ్మవార్లు కొలువు తీరుతారు. ఆ రోజు సాయంత్రం స్వామీ అమ్మవార్లు నంది వాహనంపై కొలువుదీరి ఆలయ ఉత్సవంగా ఆలయం చుట్టూ ఊరేగి ఈశాన్యభాగంలో ఉన్న పుష్కరిణి వద్దకు చేరుకుంటారు.
ఆలయపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన లక్షదీపోత్సవ కార్యక్రమంలో ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి లక్షదీపాలను వెలిగిస్తారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించి కార్తికదీపారాధనతో పునీతులవుతారు. ఆ తర్వాత ఆలయపుష్కరిణిలో జలాన్ని శివతీర్థంగా భావించి హారతి కార్యక్రమం జరుగుతుంది. పురాణ ప్రవచనకర్తలు కార్తికమాస మాహాత్మ్యాన్ని భక్తులకు తెలియజెప్తారు. ఈ కార్యక్రమం నాలుగు సోమవారాలు పౌర్ణమి నాడు జరుగుతుంది.

ఆకాశదీపం

ఆలయంలో ఆకాశదీపం నెలకొల్పే ఘట్టం కన్నులపండువగా ఉంటుంది. ముందుగా దీపానికి పూజాదికాలు నిర్వహిస్తారు. అనంతరం ధ్వజస్తంభానికి కట్టిన తాడుతో ఆకాశదీపాన్ని పైకి లాగుతుంటే పంచాక్షరీ నామస్మరణతో, ఆకాశదీపకాంతులతో ఆ ప్రాంతమంతా మరింత కాంతిమంతమౌతుంది.

వారోత్సవాలు

మల్లికార్జునస్వామి వారికి ప్రతిరోజూ తెల్లవారుజామున పదకొండు మంది ఆలయపండితులతో మహాన్యాసపారాయణ, ఆరుద్ర నక్షత్రం, మాసశివరాత్రి, పౌర్ణమి రోజుల్లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రాతఃకాలంలో జరుగుతుంది. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతి శుక్రవారం, మూలానక్షత్రం, పౌర్ణమి రోజున స్వామీఅమ్మవార్లకు పుష్పాలంకృత ఊయలసేవ, ప్రతి ఆదివారం, పౌర్ణమి,మూలానక్షత్రం రోజులలో పల్లకీసేవ, మాసశివరాత్రి రోజున నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.

సాక్షి గణపతి వద్ద ప్రత్యేక పూజలు

సాక్షిగణపతికి నిత్యం గణపతి హోమాన్ని ఆర్జితసేవగా భక్తులకు ఆచరించుకునే అవకాశం కల్పిస్తుండగా, ప్రతి బుధవారం, పౌర్ణమి, సంకటహర చవితి రోజుల్లో ప్రత్యేక గణపతి హోమాన్ని, విశేష అభిషేకాన్ని దేవస్థానం సర్కారిసేవగా నిర్వహిస్తోంది. సుబ్రహ్మణ్యస్వామికి ప్రతిమంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథుల్లో విశేష అభిషేకం నిర్వహిస్తారు.ఆలయంలోని శనగల బసవన్నకు ప్రతి మంగళవారం, త్రయోదశి సమయాల్లో వృషభసూక్తంతో విశేష అభిషేకం ఆచరిస్తారు. దీన్ని నందిసేవగా పిలుస్తారు. క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో, ఆలయప్రాంగణంలోని జ్వాలా వీరభద్రస్వామికి ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం, పూజలు నిర్వహిస్తారు, అంకాళమ్మ అమ్మవారికి ప్రతి శుక్రవారం ఉదయం విశేష అభిషేకం జరుగుతుంది.

జ్వాలాతోరణం

ఆలయానికి ముందు భాగంలో గంగాధర మండపం ఉన్న ప్రదేశంలో దేవాంగభక్తుడితో సమర్పించబడిన నూలు దారాలను ఆవునేతితో తడిపి అక్కడ ఏర్పాటు చేసిన స్తంభాలకు వేలాడదీస్తారు. భక్తుల నమశ్శివాయ భజనలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతుంది. స్వామీ అమ్మవార్లు వెండి పల్లకిలో అక్కడికి చేరుకుంటారు.

అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ నూలుదారపు గుత్తులను వెలిగిస్తారు. స్వామీ అమ్మవార్ల పల్లకిని మూడు సార్లు అటూ, ఇటూ దాటించి తీసుకుని వెళ్తారు. భక్తులు కూడా దాటి ఆ భస్మాన్ని తీసుకుని ధరిస్తారు. కొందరు దాన్ని దాచుకుంటారు. త్రిపురాసురసంహారం జరిగి కైలాసానికి తిరిగి వచ్చిన స్వామివారి గౌరవార్థం అమ్మవారు ఈ జ్వాలాతోరణకార్యక్రమాన్ని నిర్వహించిందనీ, దాన్నే నేటికీ ఆచరించడం జరుగుతోంది.

కార్తీక పౌర్ణమి నదీహారతి

ఈరోజు సాయంత్రం పవిత్ర కృష్ణానదీమతల్లికి ప్రత్యేక పూజలు ఆచరించి సంప్రదాయబద్ధంగా సారెను సమర్పించి, నదీహారతి కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి ఆలయ అర్చకులు, అమ్మవారి ఆలయ అర్చకులు పదకొండు రకాలహారతులను కృష్ణానదికి చూపుతారు. హారతిదీపకాంతులు నదిలో ప్రతిబింబించే దృశ్యం చూసి భక్తులంతా అత్యంత ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు.
ఇక ఆలస్యమెందుకు జ్యోతిర్లింగం, శక్తి పీఠంమైన శ్రీశైలాన్ని దర్శించి హరుడి కృపను పొందండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news