సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో అసలు వార్త ఏదో, నకిలీ వార్త ఏదో నమ్మలేకపోతున్నాం. కొన్ని వార్తలను నిజమే అని నమ్మి పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా బోల్తా పడుతున్నాయి. సరిగ్గా ఓ వార్త విషయంలోనూ తాజాగా ఇలాగే జరిగింది. బీహార్‌కు చెందిన ఓ రైతు హాప్ షూట్స్ అనే పంటను పండిస్తున్నాడని ఓ వార్త ఇటీవలి కాలంలో వైరల్ అయింది కదా. అయితే అదంతా వట్టిదేనని తేలింది.
బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా కరమ్‌దిహ్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల అమ్రేష్ సింగ్ హాప్ షూట్స్ అనే పంటను పండిస్తున్నాడని, ఆ పంట కేజీ ధర రూ.1 లక్షలకు అమ్ముడవుతుందని ఒక వార్త ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది కదా. అయితే నిజానికి ఆ వార్త ఫేక్ అని తేలింది. ఓ ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయమై నిజానిజాలు తెలుసుకునేందుకు ఆ రైతు ఉన్న గ్రామానికి వెళ్లి విచారణ చేసింది. ఈ క్రమంలో అసలు అతను గానీ, వేరే ఎవరు గానీ ఆ గ్రామంలో, చుట్టు పక్కల ఎక్కడా ఆ పంటను వేయలేదని వెల్లడైంది. ఇదంతా బోగస్ వార్త అని తేల్చారు.
నిజానికి ఈ వార్తను పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా తమ పత్రికల్లో, సైట్లలో ప్రచురించాయి. కానీ ఈ వార్త ఫేక్ కావడంతో ఆయా సంస్థలు మళ్లీ బోల్తా కొట్టాయి. గతంలోనూ పలు వార్తల విషయంలో ఇలాగే జరిగింది. దీంతో అసలు వార్త ఏది, నకిలీ వార్త ఏది అని కనుక్కోవడం మీడియా సంస్థలకు కూడా తలనొప్పిగా మారింది. అయితే ఆ పంట కేజీ ధర రూ.1 లక్ష పలకడం వాస్తవమే. కానీ దాన్ని ఆ రైతు మాత్రం వేయలేదు. ఇది నిజం.