ఫ్యాక్ట్‌ చెక్: 5జి మొబైల్‌ టవర్ల వల్ల కరోనా వస్తుందా ? నిజమేనా ?

-

మన దేశంలో ఇంకా 5జి నెట్‌వర్క్‌ రాలేదు కానీ.. అమెరికా వంటి దేశాల్లో 5జి మొబైల్‌ టవర్ల ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. త్వరలో అక్కడి ప్రజలు 5జి నెట్‌వర్క్‌ను ఆస్వాదించనున్నారు. అయితే 5జి మొబైల్‌ టవర్ల ఏర్పాటు ఏమో గానీ.. అక్కడి జనాలకు వాటిపై తప్పుడు వార్తలను కొందరు ప్రచారం చేస్తున్నారు. 5జి మొబైల్‌ టవర్ల నుంచి కరోనా వైరస్‌ నేరుగా రేడియో తరంగాల ద్వారా ఫోన్లకు వస్తుందని, అక్కడి నుంచి ఆ వైరస్‌ మనకు చేరుతుందని, దీంతో మన శరీర రోగ నిరోధక శక్తి నశిస్తుందని.. వార్తలను ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలను అమెరికా అధికారులు ఖండించారు. వీటిలో ఎంత మాత్రం నిజం లేదని అంటున్నారు.

అమెరికాలో ప్రస్తుతం అనేక చోట్ల ఏర్పాటు చేసిన 5జి మొబైల్‌ టవర్లను కొందరు ధ్వంసం చేశారు. అలాగే యూరప్‌, న్యూజిలాండ్‌, కెనడా దేశాల్లోనూ ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం స్పందించింది. టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లకు, పోలీసు అధికారులకు ఈ ఘటనలపై హెచ్చరికలు జారీ చేసింది. సెల్‌ టవర్లను ధ్వంసం చేసేవారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అయితే సెల్‌ టవర్ల ధ్వంసం వెనుక కరోనా పుకారు వార్తే ఉందని అమెరికా అధికారులు గుర్తించారు. 5జి మొబైల్‌ టవర్ల వల్ల కరోనా వస్తుందని నమ్మిన కొందరు ఆ టవర్లను ధ్వంసం చేస్తున్నారని నిర్దారించారు. అయితే అవన్నీ పుకార్లేనని, వాటిలో ఎంత మాత్రం నిజం లేదని అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అధికారులు ధ్రువీకరించారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ.. 5జి టవర్ల వల్ల కరోనా వస్తుందని ఎక్కడా ఎవరూ చెప్పలేదని, ఆ వార్తలు ఫేక్‌ అని, అసలు ఆ టవర్లకు, కరోనాకు సంబంధం లేదని, కరోనా వైరస్‌ కేవలం మనుషులు ఒకరినొకరు టచ్‌ చేయడం ద్వారానే వస్తుందని.. తెలిపింది. కనుక ఇలాంటి ఫేక్‌ వార్తలను ఎవరూ నమ్మకూడదని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version