దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు గత కొన్ని రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేరళలో రోజూ 20వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరు వరకు మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ను కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. భారత్‌లో మొదట గుర్తించబడిన డెల్టా వేరియెంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక కేరళలోనూ డెల్టా వేరియెంట్ కేసులు పెరిగిపోయాయి. అయితే కేరళలో ఓ కొత్త కోవిడ్ వేరియెంట్ వ్యాప్తి చెందుతుందని వార్తలు వస్తున్నాయి.
కేరళలో కొత్త కోవిడ్ వేరియెంట్ వ్యాప్తి చెందుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పరీశిలించేందుకు పలువురు నిపుణులను కొన్ని జిల్లాలకు పంపింది. అయితే వారు అన్ని వివరాలను పరిశీలించాక అసలు విషయం చెప్పారు. కొత్త కోవిడ్ వేరియెంట్ వ్యాప్తి చెందుతుందన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇదే విషయాన్ని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దారించింది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వదంతులను నమ్మవద్దని కోరింది.
కాగా కేరళలో బుధవారం ఒక్క రోజే 23,500 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం టీకాల పంపిణీని వేగవంతం చేసింది. ఆర్‌టీపీసీఆర్ టెస్టులను పెద్ద మొత్తంలో చేస్తోంది. ఇక ఇదే విషయమై ఎప్పటికప్పుడు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా పర్యవేక్షిస్తోంది.