ఏపీ రాజధాని పై ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంది. ఎక్కడ చూసినా ఏపీ రాజధానులపైనే చర్చ రసవత్తరంగా సాగుతుంది. నిన్న ఏపీ అసెంబ్లీ లో శీతాకాల సమావేశాల చివరి రోజున జరిగిన రాజధాని చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. ఏపీకి ఒకే రాజధాని ఎందుకు.. మూడు రాజధానులు ఉంటే తప్పేమిటీ..? అంటూ ప్రకటించి సంచలనం రేపాడు. రాజకీయ వేడికి ఆజ్యం పోశాడు. అమరావతిని యధాతధంగా ఉంచేసి.. అమరావతికి తోడు కర్నూల్, విశాఖపట్నంలను కూడా రాజధాని కేంద్రాలుగా చేయాలని జగన్ ఆలోచనగా చెప్పారు.
పరిపాలన వికేంద్రీకరణ, సమన్యాయ పాలన దిశగా జగన్ ఆలోచన చేశారు. ఈ ఆలోచనకు ప్రతిరూపమే ఈ మూడు రాజధానులు. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తన పరిపాలన కాలంలో కేవలం రాజధాని కేంద్రంగా అమరావతిపైనే దృష్టి సారించారు. అభివృద్ధిని మొత్తం అమరావతిలోనే చేయాలనే ఆలోచన చేశారు. అంతే కాదు అమరావతిలో రాజధాని పేరుతో దాదాపు 30వేల ఎకరాలకు పైగా మూడు పంటలు ఇచ్చే పంట భూములను సామ, ధాన, భేద, దండోపాయాలు ప్రయోగించి సేకరించారు.
అయితే ఇంత పెద్ద ఎత్తున భూముల సేకరణ కేవలం రాజధానికి సేకరరించడం అవసరమా అనేది ఇప్పుడు వైసీపీ ఆలోచనగా చేస్తుంది. దీనికి తోడు రాజధాని ఒకే ప్రాంతంలో చేస్తే ప్రాంతీయ అసమానతలు వస్తాయని, తరువాత ప్రాంతీయ విద్వేశాలు వస్తే మరో తెలంగాణ ఉద్యమాలు రావన్న గ్యారెంటీ ఏమీ లేదనే భావనతో పరిపాలనను మూడు భాగాలుగా చేసేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఐదేండ్లు భ్రమల్లోనే ఏపీ ప్రజలను నమ్మించాడు. అయితే అది ఇప్పుడు బాబు బండారం అసెంబ్లీ సాక్షిగా బయట పడింది.
తన అనుయాయులు, పార్టీల నేతలు వేల ఎకరాలు కొనుగోలు చేసి భ్రమరావతిని చేయాలని ఆలోచించారు. దీనికి చెక్ పెడుతూ జగన్ పరిపాలన వికేంద్రికరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని తలచి అన్ని ప్రాంతాల ప్రజలకు సమ న్యాయం చేసేందుకు సన్నద్దమయ్యారు. అంతే కాదు దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి లేనంత విస్తీర్ణంను కేవలం అమరావతికే సేకరించడం నమ్మలేని నిజం. వాస్తవానికి దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి అమరావతికి ఉన్నంత విస్తీర్ణం లేదు. అమరావతికి 8600చదరపు కిలోమీటర్ల వైశాల్యం సేకరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
విశ్వనగరంగా కీర్తినందుకుంటున్న హైదరాబాద్ నగరమే 650 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంది. ఇక బెంగుళూరు 705, కలకత్తా 205, చెన్నై 426, ఢిల్లీ 1484, ముంబై 603 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటే అమరావతి మాత్రం 8600 చ.కి. వైశాల్యంతో ఉండటం ఇక్కడ చర్చనీయాంశం. అంటే దేశ రాజధానికన్నా ఆరు రేట్లు ఎక్కువ. దేశ ఆర్థిక రాజధాని ముంబై కన్నా 14రేట్లు ఎక్కువగా, హైదరాబాద్ కన్నా 12రేట్లు ఎక్కువగా సేకరించారు అంటే అంత అవసరమా అని ఇప్పుడు వినిపిస్తున్న మాట.
కొత్తగా ఏర్పడి రాష్ట్ర రాజధానులు కూడా కేవలం 300 చదరపు కిలోమీటర్ల వైశాల్యంను దాటలేదు. అంటే బాబోరు మాత్రం ఇంత సేకరించి ధాన్యాగారంగా ముద్ర పడిన అమరావతిని అన్నమో రామచంద్ర అనే దుస్థితికి తీసుకెళ్లాడు. అందుకే జగన్ ఇప్పుడు బాబోరికి చెక్ పెట్టేందుకు మూడు రాజధానులు ప్రతిపాదన చేస్తున్నారు. ఏదేమైనా జగన్ ఆలోచనకు బాబోరు బిత్తర చూపులు చూస్తున్నారే అని చెప్పవచ్చు.