రోడ్డు మీద వెళ్తున్న కార్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలో చిక్కుకొని కొట్టుకుపోతే ఎలా ఉంటది.. వామ్మో.. అటువంటి ఘటనలు జరుగుతాయా? అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే అటువంటి ఘటన ఒకటి జరిగింది. పదండి.. ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో హల్ ద్వానీ అనే నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఎలాగంటే రోడ్లన్నీ చెరువులు, నదులను తలపిస్తున్నాయి. రోడ్డు మీద ఏదైనా వాహనం వెళ్లిందంటే ఖతం.. అది ఆ ప్రవాహానికి కొట్టుకుపోవాల్సిందే. వరదలు ముంచెత్తుతున్నాయని తెలిసినా కొంతమంది సాహసం చేస్తూ ఆ నీళ్ల పైనే వాహనాలను పోనిస్తున్నారు. కొంతమంది ఆ ప్రవాహాలను తప్పించుకున్నా.. మరికొందరు మాత్రం వాళ్ల వాహనాలను నీటిలోకి సమర్పించుకోవాల్సి వస్తోంది.
ఇలాగే.. ఓ రెండు కార్లు, ఓ ఆటో వరదలో చిక్కుకుపోయాయి. కార్లు ముందుకు కదలట్లేవు. ఏం చేయాలి. అని ఆలోచిస్తుండగానే కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం ప్రారంభించాయి. దీంతో చేసేదేంలేక కారును నీటిలో వదిలేసి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు ఆ కార్లలోని వ్యక్తులు. ఒక కారు తర్వాత మరో కారు.. ఆ తర్వాత ఆటో కూడా ఆ నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో చూస్తు నిలబడ్డారు తప్పితే ఎవ్వరూ వాటిని ఆపడానికి సాహసం చేయలేకపోయారు. ఇక.. ఈ ఘటనను అక్కడి స్థానికులు తమ మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)