పెళ్లి ఫిక్స్ అవగానే ముందు చూసేది. కళ్యాణమండపం. పెళ్లికి రెండు నెలల ముందే బుక్ చేసుకుంటారు. లేకపోతే దొరకవు అని. అసలు శ్మాశానంలో పెళ్లి అనే కాన్సప్ట్ మీరు ఎప్పుడైనా విన్నారా..? ఎవ్వరూ చేసుకోరు కదా..! కానీ ఈ జంట వారి కొత్త జీవితాన్ని శ్మాశానం వేదికగానే మొదలుపెట్టారు. ఎందుకు ఇలా చేసుకున్నారు, కారణం ఏమై ఉంటుందో చూద్దామా..!
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని శిర్ది సమీపంలోని రహతా గ్రామానికి చెందిన మయూరీ ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన మనోజ్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు కూడా అందుకు అంగీకరించారు. అయితే పెళ్లి కూతురు తండ్రి గంగాధర్ ఓ కండీషన్ పెట్టాడు. తన కుమార్తె పెళ్లిని శ్మశానంలో జరిపించాలని ఉందని చెప్పాడు. అందుకు వరుడి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. అయితే వివాహాన్ని శ్మశానంలోనే గ్రాండ్‌గా జరిపించారు. అక్కడి స్థానికులు ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. అసలు పెళ్లి శ్మశానంలో ఎందుకు చేశారనే విషయంపై నిదానంగా విచారిస్తే అసలు విషయం తెలిసింది.
పెళ్లి కూతురు తండ్రి గంగాధర్ మహాసంజోగి సామాజికవర్గానికి చెందడంతో శ్మశానంలో కాటికాపరిగా పని చేస్తున్నాడు. శ్మశానంలోనే కాపురం ఉంటున్నాడు. అక్కడే తన కూతురు పుట్టింది. పెరిగింది. అందుకే తన కుమార్తె పెళ్లిని పుట్టి పెరిగిన చోటే జరిపించాలని గంగాధర్ వరుడి తల్లిదండ్రులకు చెప్పాడు. అందుకు బంధువులు, కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శ్మశానంలోనే తన కూతురు పెళ్లిని ధూం ధాంగా జరిపించాడు.
పెళ్లి ఎక్కడ జరిగినా పెద్దలంతా ఆశీర్వదించడం, పెళ్లి కూతురు తండ్రి కోరిక తీరడంతో వివాహం హ్యాపీగా జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు, మిత్రులు నూతన వధువరుల్ని ఆశీర్వదించారు. వివాహాది శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ పెళ్లి వేడుకపై మాత్రం నెటిజన్లు వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రిలో పుడితే.. అక్కడే పెళ్లి చేపిస్తారా..? శుభకార్యం అనేది ఇలాంటి ప్లేస్‌లో చేయడం ఏంటి.? అని కొందరు అంటుంటే.. ఆ తండ్రి ఆలోచనను అందరూ గౌరవించడం ఇక్కడ గొప్ప విషయం అని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా శ్మశానంలో పెళ్లి జరగటంతో ఈ వార్త కాస్త వైరల్‌గా మారింది.!