బిచ్చగాళ్లలోనూ లక్షాధికారులు ఉంటారని మనం చాలా సార్లు చదువుకున్నాం. ఇలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో చోటు చేసుకున్నది. ఓ బిచ్చగాడు.. వయసు మీద పడటంతో మృతిచెందాడు. బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దగ్గర రోజు అడుక్కునేవాడు 75 ఏళ్ల షరీఫ్.
అయితే.. వయసు మీదపడటం, ఇతర అనారోగ్య కారణాల వల్ల షరీఫ్ ఇటీవలే మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడికి ఉన్న కృత్రిమ కాలును తొలగించబోయారు. కాలు చాలా బరువుగా అనిపించడంతో.. లోపల ఏముందో అని చూసి షాక్ అయ్యారు పోలీసులు. అందులో అన్నీ నోట్ల కట్టలు చుట్టలుగా చుట్టి ఉన్నాయి. వాటన్నింటినీ లెక్కేస్తే 96 వేలుగా తేలింది.
షరీఫ్ స్వస్థలం హైదరాబాద్. 25 ఏళ్ల కిందటే బెంగళూరుకు వచ్చి అడుక్కుంటూ తన జీవితాన్ని సాగిస్తున్నాడు. గ్యాంగ్రీన్ అనే వ్యాధి సోకడంతో కాలు తీసేశారు. తర్వాత ఆ కృత్రిమ కాలులో ఇలా డబ్బులను దాచడం మొదలు పెట్టాడు. షరీఫ్ దగ్గర ఉన్న ఓ చీటిలోని అడ్రస్ ఆధారంగా హైదరాబాద్ లో ఉన్న అతడి బంధువులకు సమాచారం అందించారు పోలీసులు.