గుప్త నిధులంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. కోడితే.. ఒకే సారి కోటీశ్వరులు అయిపోవచ్చని అనుకుంటారు. అందుకే లంకె బిందెలు, గుప్త నిధులు.. బంగారు నాణేల కోసం ఎప్పటి నుంచో వేట జరుగుతూనే ఉన్నది.
అయితే.. తాజాగా సూర్యాపేట జిల్లాలో గుప్త నిధుల కలకలం లేచింది. హుజూర్ నగర్ మండలంలోని అమరవరం గ్రామంలోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం చాలా తతంగమే నడిచింది. నాలుగు మేకలను బలి ఇచ్చి మరీ తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో 20 కిలోల పురాతన నాణేలు కూడా లభ్యమయ్యాయి. అయితే.. ఈ విషయం ఆనోటా.. ఈనోటా పోలీసులకు చేరింది. దీంతో ఆకస్మికంగా ఆ ఇంట్లో దాడి చేసిన పోలీసులు తవ్వకాల్లో బయట పడ్డ 20 కిలోల నాణేలను స్వాధీనం చేసుకున్నారు. కాకపోతే అవి బంగారు నాణేలు కావట. రాగి, ఇత్తడి లోహాల మిశ్రమంతో చేసిన నకిలీ నాణేలట. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన గురవారెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.