నోరు తెరిస్తే వింత శబ్దం.. ఛాతిలోంచి నొప్పి.. కట్ చేస్తే.. 11 నెలల తర్వాత ఆపరేషన్

-

చిన్నపిల్లలు భలే తుంటరి పనులు చేస్తుంటారు కదూ. తమ తలను తీసుకెళ్లి పెద్ద గిన్నెలో పెట్టటం అది తీయటానికి రాక..నానా ఇబ్బందులు పడటం, ఇలాంటి తిక్కపనులు మనం కూడా చిన్నప్పుడు చాలేనే చేసుంటాం. సరిగ్గా ఇలానే ఓ చిన్నపిల్లాడు ఆడుకుంటూ పొరపాటున విజిల్ మింగేశాడు. సరే మింగినవాడేమైనా వెళ్లి ఇంట్లో అమ్మవాళ్లకు చెప్పాడా అంటే..చెప్తే ఎక్కడ తంతారో అని భయమేసి గమ్మునుండిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

పశ్చిమబెంగాల్‌ దక్షిణ 24 పరగణాల జిల్లా బరుయిపూర్‌ ప్రాంతానికి చెందిన రైహాన్‌ లస్కర్‌(12) అనే కుర్రాడు 2021, జనవరిలో విజిల్‌తో ఆడుతూ.. చిప్స్‌ తింటున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా చేతిలో ఉన్న విజిల్‌ని మింగేశాడట. బయటకు ఉద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇక దీని గురించి తల్లిదండ్రులకు చెప్తే.. కొడతారనే భయంతో సైలెంట్‌గా ఉండిపోయాడు.

ఈ సంఘటన తర్వాత రైహాన్‌ జీవితంలో విచిత్ర సంఘటనలు జరిగాయి..ఏదైనా మాట్లాడదామని నోరు తెరిస్తే.. విజిల్‌ ఊదినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి సౌండ్‌ వచ్చేది. ఇక ఈత కొడదామని వెళ్తే ఎక్కువ సమయం నీటిలో ఉండలేకపోయేవాడట. ఛాతిలో నొప్పితో బాధపడడేవాడు. ప్రారంభంలో రైహాన్‌ తల్లిదండ్రులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు.

ఆ తర్వాత రైహాన్‌ తరచుగా అనారోగ్యానికి గురవుతుండేవాడు. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చూపిస్తే.. వైద్యులు ఏవో మందులు రాసే వారు కానీ అసలు సమస్య ఏంటో చెప్పలేకపోయారు. ఇలా ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోగా.. రోజురోజుకి రైహాన్‌ ఆరోగ్యం మరింత దిగజారింది. ఈ క్రమంలో ఓ వైద్యుడి సూచన మేరకు కుమారుడిని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ రైహాన్‌ పరిస్థితిని గమనించిన సీనియర్‌ వైద్యుడు ప్రొఫెసర్ అరుణాభా సేన్‌గుప్తా అతడికి ఎక్స్‌రే తీసి.. ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కున్న విజిల్‌ని గుర్తించారు. అనంతరం అరుణాభా ఆధ్వర్యంలో వైద్యులు రైహాన్‌కు ఆపరేషన్‌ చేసి విజిల్‌ని తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మొత్తానికి బుడ్డోడు చేసిన పని ఆపరేషన్ వరకూ వెళ్లింది. ఆ కుర్రాడు భయంతోనే ఇంట్లో చెప్పలేకపోవటం వల్ల పరిస్థితి ఇంత వరకూ వచ్చింది. అదృష్టవశాత్తూ ఆ కుర్రాడికి ఏం కాలేదు..చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో ఏదైనా మార్పులు వస్తే తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి..ముఖ్యంగా ఆడుకునే స్టేజ్ పిల్లల్లో..వాళ్లు అటు మరి చిన్నపిల్లలు కాదు..ఇటు అంత పెద్ద వాళ్లు కాదు. వాళ్లను ఎప్పటికప్పుడు గమినిస్తూనే ఉండాల్సి ఉంటుంది కదా.!

Read more RELATED
Recommended to you

Latest news