కరోనా మహమ్మారి మరోసారి చైనాపై విరుచుకుపడింది. దీంతో కరోనా కట్టడికి చైనాలో లాక్‌డౌన్ విధించక తప్పలేదు. అయితే చైనాలోని షాంఘై నగరంలో పూర్తి లాక్‌డౌన్ విధించి, కఠిన కరోనా నిబంధనలు అమలు చేశారు. దీంతో కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయి. చైనాకు ఆర్థిక నగరమైన షాంఘైలో ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడంతో ఇప్పటికే పలు ఆంక్షలు సడలించిన అధికారులు.. వచ్చే నెల జూన్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయించారు. వైరస్ కట్టడికి కఠిన లాక్‌డౌన్ అమలు చేయడంతో ప్రజలు నిత్యావసరాలత కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 6 వారాలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతిన్నది.
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా 2.5 కోట్ల జనాభా ఉన్న షాంఘై నగరంలో మార్చి చివరి వారంలో లాక్‌డైన్ విధించారు. వైరస్ ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ఆంక్షలను పొడిగిస్తూ వచ్చింది. అయితే, వైరస్ నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలతో కేసులు తగ్గుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపు ఇప్పటికే పలు ఆంక్షలను సడలించినట్లు డిప్యూటీ మేయర్ జోంగ్ మింగ్ పేర్కొన్నారు. జూన్ ఒకటి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.