చైనాలోని అనేక ప్రాంతాల్లో గబ్బిలాలను ఆహారంగా తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఇక వూహాన్ వెట్ మార్కెట్‌లో గబ్బిలాలను బహిరంగంగానే విక్రయిస్తుంటారు. అయితే కేవలం చైనాలో మాత్రమే కాదు.. మన దేశంలోనూ గబ్బిలాలను కొందరు ఇష్టంగా తింటారు. వాటిని కోడి మాంసంలా లొట్టలేస్తూ ఆరగిస్తారు. ఇంతకీ అదెక్కడంటే…
మన దేశంలోని నాగాలాండ్‌లో మిమి అనే గ్రామంలో ఉండే గుహల్లో అక్కడి వారు గబ్బిలాలను పట్టుకుంటారు. అనంతరం వాటిని తీసుకువచ్చి పండుగ రోజున కోసి వాటి మాంసాన్ని వండి తింటారు. ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో ఇలా అక్కడి వారు గబ్బిలాలను కోసి మాంసం వండి తింటారు. వాటిలో ఔషధ గుణాలు ఉన్నాయని వారు నమ్ముతారు. అందుకే వారు గబ్బిలాల మాంసాన్ని తింటారు. ఇక ఆ వేడుకలను చూసేందుకు వచ్చే అతిథులకు కూడా వారు గబ్బిలాల ఆహారాన్నే పెడతారు.
ఇక మిమి వాసులు గబ్బిలాల ఎముకల నుంచి పొడిని తయారు చేసి పలు ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఇలా అక్కడి ప్రజల జీవనవిధానంలో గబ్బిలాలు భాగం అయ్యాయి. అయితే వూహాన్‌లోని వెట్ మార్కెట్‌లో గబ్బిలాల ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని చాలా మంది నమ్ముతున్నారు. కాగా అక్కడ లాక్‌డౌన్ ఎత్తేయడంతో ఇప్పుడు అక్కడ గబ్బిలాలను మళ్లీ అమ్మడం మొదలు పెట్టారు.