ఆ ఇద్దరమ్మాయిలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు!

ఒక ఆడ, మగ ఇష్టపడి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. కానీ, దీనికి విరుద్ధంగా అక్కడక్కడా కొన్ని విచిత్ర పెళ్లిళ్లు జరుగుతాయి. అంటే, ఇద్దరు ఆడవాళ్లు లేదా ఇద్దరు మగవాళ్లు పెళ్లిచేసుకుంటారు. విదేశాల్లో ఇటువంటి పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. మన దేశంలో ఇవి తక్కువ. ఇక్కడైతే ఇటువంటి జీవినాన్ని కొనసాగిస్తే అందరూ విచిత్రంగా చూస్తారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి పెళ్లికి ఎటిపరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. తాజాగా ఇలాంటి పెళ్లి∙హరియాణాలో జరిగింది. ఇక్కడ ఇద్దరు అమ్మాయిల మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

ఇద్దరు అమ్మాయిల్లో ఒకరి వయస్సు 20 ఏళ్లు అయితే, మరో అమ్మాయి వయస్సు 19. వీరిరువురూ గురుగ్రామ్, జాజర్‌ జిల్లాలకు చెందినవారు. వీరిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకునేవారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అలా ఏళ్లు గడిచిన వారి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటామని ఇంట్లో వారి అంగీకారం కోరగా వారు వ్యతిరేకించారు. సమాజలో ఆమోదించే విషయం కాదు.. నిర్ణయం మార్చుకోమని హెచ్చరించారు. అయినా.. వారు తల్లిదండ్రుల మాట వినిపించుకోలేదు. ఓ రోజు ఇంట్లో నుంచి పారిపోయి సోన్‌హాలోని ఓ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఇద్దరమ్మాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా.. ఆ యువతులిద్దరూ తాము మేజర్లమని, తమ ఇష్టానుసారంగానే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. వారి తల్లిదండ్రులు వారికి నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. వారు వినిపించుకునే పరిస్థితిలో లేరు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని, ఏదేమైనా ఇద్దరం కలిసి జీవిస్తామని చెబుతున్నారని కేసుకు సంబంధించిన పోలీసు అధికారి తెలిపారు.