మీరు భోజన ప్రియులా ? ఎలాంటి ఆహారాన్నయినా ఇట్టే లాగించేస్తారా ? తక్కువ సమయంలోనే భారీ ఎత్తున అనేక ఆహారాలను తినగలిగే సమర్థులా ? అయితే ఈ ఆఫర్ మీకోసమే. దీని వల్ల మీరు ఏకంగా ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని గెలుచుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా.. భోజనం చేయడమే. అవును.. ఓ రెస్టారెంట్ వారు ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు.
పూణెలోని ఓల్డ్ ముంబై-పూణె హైవేపై వడ్‌గావ్ మవల్ అనే ప్రాంతంలో హోటల్ శివరాజ్ ఉంది. అక్కడ బుల్లెట్ థాలి పేరిట ఓ ప్రత్యేకమైన భోజనం లభిస్తుంది. దాని ధర రూ.2,500. దాన్ని కనీసం 7 మంది తినవచ్చు. అందులో ఫిష్, ప్రాన్స్, మటన్, చికెన్ తదితర 12 రకాల డిషెస్ ఉంటాయి. అయితే ఆ భోజనాన్ని కేవలం ఒకే వ్యక్తి 60 నిమిషాల్లో.. అంటే.. 1 గంటలో తినాలి. కంచంలో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా పూర్తిగా తినేయాలి. అది కూడి ఇచ్చిన టైమ్ లిమిట్‌లో పూర్తి చేయాలి. దీంతో షాపులోనే డిస్‌ప్లేకు ఉంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వాహనాన్ని బహుమతిగా ఇస్తారు. దాని విలువ సుమారుగా రూ.1.65 లక్షలుగా ఉంది.
కరోనా నేపథ్యంలో బిజినెస్ సరిగ్గా జరగకపోవడం వల్లే ఆ రెస్టారెంట్ ఓనర్ ఈ ఆఫర్ పెట్టాడు. అయితే ఈ ఆఫర్‌ను చాలా మంది స్వీకరించారు. కానీ కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఇప్పటి వరకు ఆ భోజనాన్ని 1 గంటలో తిని బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఎవరూ మళ్లీ విన్నర్ కాలేకపోయారు. కనుక మీకు అలా తినే కెపాసిటీ ఉంటే అక్కడికి వెళ్లి తిని చూడండి. ఏకంగా బుల్లెట్ వెహికిల్‌ను సొంతం చేసుకోవచ్చు.