యువ‌రాజు ప‌ట్టాభిషేకం.. నాయ‌కుల‌ అత్యుత్సాహం

-

టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సీఎం అవుతారన్న చర్చ టీఆర్‌ఎస్‌లో మరోసారి జోరందుకుంది. ఆయన ముఖ్యమంత్రి అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఒక్కో ప్రజాప్రతినిధి గళమెత్తుతున్నారు.. స్వరం పెంచుతున్నారు. పార్టీలోని ఒక్కోనేత కేటీఆర్‌ సీఎం కావాలనడం నాయ‌కుల‌ అత్యుత్సాహం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి…

సీఎంగా కేటీఆర్‌ పట్టాభిషేకం ముహూర్తం ఖరారైందా అన్న చర్చ ఇప్పుడు గులాబీ పార్టీలో ఊపందుకుంది. పార్టీలోని ఒక్కోనేత కేటీఆర్‌ సీఎం కావలంటూ ఏదో ఒక సందర్భంలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు మంత్రులు శ్రీనివాసగౌడ్‌, తలసాని శ్రీనివాస యాదవ్‌. మధ్యలో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలోనే ఈ అంశంపై స్పష్టత ఇవ్వడంతో అంతా నెమ్మదించారు. మరి.. ఇప్పుడు ఎలాంటి సంకేతాలు వెళ్లాయో ఏమో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కేటీఆర్‌ సీఎం అనే నినాదాన్ని బలంగా ఎత్తుకుంటున్నారు.

ఎమ్మెల్యే షకీల్‌ ఇంకో అడుగు ముందుకేసి వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్‌ సభా నాయకత్వాన జరగాలని కీలక వ్యాఖ్యలు చేశారు . కేటీఆర్‌ను సీఎంను చేసేయాలని మంత్రి ఈటల రాజేందర్‌, సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ తదిరులు సైతం వంత పాడుతున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పద్మారావు అయితే కాబోయో సీఎం కి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేశారు.

టీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌ సీఎం అన్న ప్రచారం కొత్తేమీ కాదు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో.. మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ చర్చను తీసుకొచ్చారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనను కేసీఆర్‌ తెరపైకి తీసుకొచ్చిన తర్వాతే ఈ వాదనకు మరింత ఊపు వచ్చింది. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని.. సీఎంగా కేటీఆర్‌ బాధ్యతలు చేపడతారని అనుకున్నారు. ఒకవేళ సీఎం మారితే కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు. అందుకే ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు.. కేబినెట్‌లో బెర్త్‌ ఆశిస్తోన్నవాళ్లు కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. ఆ కారణంగానే పోటాపోటీగా కేటీఆర్‌ సీఎం అనే కోరస్‌ అందుకున్నట్టు సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టు.. యాదాద్రి ఆలయ పునర్‌ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. కాళేశ్వరం పూర్తయింది. ఆ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందుతున్నాయని అధికారపార్టీ సంతోషిస్తోంది. యాదాద్రి ప్రాజెక్టు కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది. త్వరలో అక్కడ అవసరమైన యజ్ఞయాగాదులు నిర్వహించి.. ప్రారంభోత్సవాలు పూర్తి చేసి.. కేటీఆర్‌ పట్టాభిషేకంపై ప్రకటన చేస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ముహూర్తం ఫిక్స్‌ అయిందని అనుకుంటున్నారు.

అందుకే ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ కీలక నేతలు స్వరం పెంచుతున్నారని సమాచారం. అయితే ఏప్రిల్‌లో పార్టీ ప్లీనరీలో ఈ విషయాన్ని ప్రకటిస్తారా? లేక అంతకంటే ముందే అన్నీ జరిగిపోతాయా అని గులాబీ శిబిరంలోని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news