ప్రతి సంవత్సరం విజయదశమి రోజున విజయ ముహూర్తం అనేది ఉంటుంది. ఆ ముహూర్తంలో పని ప్రారంభిస్తే అది ఎంతో విజయవంతం అవుతుంది అని కొందరు నమ్ముతారు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన విజయదశమిని అందరూ జరుపుకుంటారు, విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:03 నిమిషాల నుండి మధ్యాహ్నం 2:49 నిమిషాల మధ్యలో ఉంది. ఈ సమయంలో ఏ పని అయినా ప్రారంభిస్తే సంవత్సరం అంతా ఎన్నో విజయాలు సొంతం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన ఫలితాలను లభించాలి అంటే విజయదశమి రోజు జమ్మి చెట్టు వద్ద పూజ కూడా చేయాలి.
ముందుగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత మూడు తమలపాకులు తీసుకుని మూడు పసుపు ముద్దలు చేసి వాటి పై పెట్టాలి. ప్రతి పసుపు ముద్ద పైన, కుడి ఎడమ వైపులా కూడా బొట్లు పెట్టాలి. ఇలా తమలపాకుల పై ఉంచిన పసుపు ముద్దలకు అక్షింతలు, పూలు ఉపయోగించి పూజ చేస్తూ మంత్రం చదవాలి. మధ్యలో ఉన్న తమలపాకు పై పసుపు ముద్ద కు పూజ చేస్తూ ఓం అపరాజతాయై నమః అంటూ 21 సార్లు మంత్రం చదువుతూ పూజ చేయాలి.
అదేవిధంగా ఎడమవైపు ఉన్న పసుపు ముద్ద కు ఓం జయాయే నమః అంటూ 21 సార్లు మంత్రం చల్లుతూ పూజ చేయాలి. కుడి వైపు ఉన్న పసుపు ముద్దకు అయితే ఓం విజయాయై నమః అని 21 సార్లు చదువుతూ పూలు అక్షింతలు తో పూజ చేయాలి. ఆ తర్వాత కర్పూరంతో హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఆ పసుపు ముద్దలను ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో పెట్టాలి. చివరగా శమీ శమయతే పాపం శమీశతృ వినాశనమ్ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ అని చదువుతూ మూడు సార్లు ప్రదక్షిణం చేయాలి.