శివక్షేత్రాలలలో శివరాత్రి ఉత్సవాలు ఇలా !

-

శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. అందుకే ఆ రోజున ప్రత్యేక భక్తిశ్రద్ధలతో త్రినేత్రుడిని కొలుస్తారు. శివనామస్మరణతో రోజంతా గడుపుతూ రాత్రి జాగారం చేస్తారు. భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకునేలా ఉపవాసాలు చేస్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న తెలంగాణలోని శైవ క్షేత్రాల విశేషాలు తెలుసుకుందాం…

వేములవాడ రాజన్న దేవాలయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో రాజరాజేశ్వరుడిగా కొలువుదీరాడు శంకరుడు. కరీంనగర్ నుంచి 40-50 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ శైవక్షేత్రం మహాశివరాత్రి నాడు ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి శివభక్తులు పెద్దఎత్తున తరలివస్తుంటారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కడతారు. కొందరైతే సాయంత్రం సమయంలో ఆలయానికి చేరుకుని స్వామి సన్నిధిలోనే జాగారం చేస్తుంటారు. వేములవాడ రాజన్న సన్నిధికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది. వృత్రాసురిని చంపిన ఇంద్రుడు బ్రహ్మ హత్యదోషం నివారించుకోవడానికి ఎన్నో పుణ్యక్షేత్రాలకు తిరిగాడు. అయితే ఎక్కడకు వెళ్లినా కూడా.. దోష నివారణ జరగలేదట. చివరకు బృహస్పతి సూచనతో వేములవాడలోని రాజేరాజేశ్వర స్వామిని దర్శించుకున్నాడట. ఇక్కడకు రావడంతోనే ఇంద్రుడికి దోష పరిహారం లభించిందని పెద్దలు చెబుతుంటారు. బద్ధి పోచమ్మ, సోమేశ్వర, భీమేశ్వర, విఠలేశ్వర తదితర ఆలయాలు కూడా వేములవాడలో కొలువుదీరాయి. ఇక్కడ దూడలను స్వామికి మొక్కులుగా ఇచ్చి వెళ్లడం అనాదిగా వస్తున్న ఆచారం.

కొమురవెల్లి మల్లన్న

సిద్ధిపేట జిల్లాలో కొలువుదీరిన కొమురవెల్లి మల్లన్న భక్తుల కొంగుబంగారమై నిలుస్తున్నాడు. మహాశివరాత్రి పర్వదినాన జాతర వేడుకలు ఘనంగా జరుగుతాయి. మల్లికార్జున స్వామి రూపంలో వెలిసిన స్వామివారి విగ్రహం పుట్టమన్నుతో రూపుదిద్దుకోవడం విశేషం. 500 సంవత్సరాల కిందటి విగ్రహంగా చెబుతుంటారు. స్వామికి ఇరువైపులా గొల్ల కేతమ్మ, బలిజ మేడమ్మ విగ్రహాలు ప్రతిష్టించి ఉంటాయి. యాదవుల ఆడపడుచు గొల్ల కేతమ్మ, లింగబలిజల ఆడపడుచు బలిజ మేడమ్మను స్వామివారు వివాహం చేసుకున్నట్లు ప్రతీతి. కొమురెల్లి మల్లన్న దివ్యక్షేత్రంలో శివరాత్రి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు.

కీసర రామలింగేశ్వరస్వామి

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి హైదరాబాద్ కు అతిదగ్గర్లో ఉంటుంది కీసరగుట్ట. సికింద్రాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరం, ఈసీఐఎల్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దివ్యక్షేత్రం. ఇక్కడ రామలింగేశ్వర స్వామి భవానీ సమేతుడై కొలువుదీరాడు. పురాణాల ప్రకారం.. శివలింగం ప్రతిష్టించాలని అనుకుంటాడు శ్రీరాముడు. అయితే లింగం వారణాసి నుంచి తీసుకురావాలని ఆంజనేయుడిని పురమాయిస్తాడు. సరే అని బయలుదేరి వెళ్లిన ఆంజనేయుడు ఏ లింగమో తెలియక 101 లింగాలను తనవెంట తీసుకొస్తాడు. అప్పటికే ముహుర్త సమయం మించిపోతుండటంతో.. శివుడే ప్రత్యక్షమై శ్రీరాముడికి లింగం ఇచ్చాడని ప్రతీతి. హనుమ వచ్చేంత లోపే లింగ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిపోతుంది. దాంతో తాను తెచ్చిన లింగాలను ప్రతిష్టించలేదనే కోపంతో.. వాటిని విసిరివేశాడంట. అందుకే కీసరగుట్టలో ఎక్కడ చూసినా లింగాలు కనిపిస్తాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జరిగే జాతర అంగరంగంగా ఉంటుంది.

కాళేశ్వర క్షేత్రం

ముక్తేశ్వర క్షేత్రం.. కాళేశ్వరం ఇక్కడ కాళేశ్వరుడు (యముడు), ముక్తేశ్వరుడు కొలువుదీరి ఉన్నారు. ఆలయంలోకి వెళ్లగానే తొలుత కాళేశ్వరుడిని పూజించి ఆ తర్వాత ముక్తేశ్వరుడిని కొలిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందనేది ఒక నమ్మకం. అయితే ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు ఆయన ముక్తిని ప్రసాదించడంతో.. యముడికి పనిలేకుండా పోయిందట. దీంతో యముడు శివుడితో మొరపెట్టుకున్నాడట. దాంతో యముడిని తన పక్కనే లింగాకారంలో కొలువుదీరమని చెప్పాడట. అలా లింగాకారంలోకి మారిపోయాడు కాళేశ్వరుడు. అయితే కాళేశ్వరం వెళ్లేవారు లింగాకారంలో ఉన్న యముడిని కొలవకుండా వెళ్లిపోతే ముక్తి దొరకదనేది ప్రతీతి. ఇక్కడ ప్రతిష్టించిన లింగానికి రెండు రంధ్రాలుంటాయి. వాటిలో నీళ్లు పోస్తే ఆలయానికి దగ్గర్లో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమంలో కలుస్తాయి. ఇక్కడ స్వామివారిని విశేషంగా అర్చిస్తారు.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news