దేశంలో రకరకాల కాలుష్య కారకాలు పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ ప్రభావం జీవవైవిధ్యంపై పడి అనేక రకాల జీవజాతులు అంతరించిపోతున్నాయి. అదే కోవలో ఎన్నో పక్షి జాతులు కనుమరుగవుతున్నాయి. తాజాగా విడుదలైన ‘ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్-2020’ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలో పక్షుల జనాభా వేగంగా పడిపోతున్నదని తెలిపింది.
సంచార అటవీ జీవజాతుల సంరక్షణపై గుజరాత్‌లో జరిగిన ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)’ 13వ సమావేశం సందర్భంగా.. ‘ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్-2020’ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికను.. 15 వేల మంది పక్షి ప్రేమికులు, పక్షి పరిశోధకుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా, 10 సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి.
ఈ నివేదికలో మొత్తం 867 రకాల పక్షి జాతుల స్థితిగతులను పొందుపర్చారు. ఈ నివేదిక ప్రకారం.. ఎన్నో పక్షి జాతుల జనాభా వేగంగా పడిపోతున్నది. మరికొన్ని జాతుల పక్షులైతే దాదాపు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ 867 పక్షి జాతుల్లో.. జానాభాను పెంచుకుంటున్న పక్షి జాతులకంటే, జనాభాను కోల్పోతున్న పక్షి జాతులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇక గద్దలు, రాబందులు, తీరాలకు వలసొచ్చే పక్షుల సంఖ్య కూడా అత్యధికంగా తగ్గడం విచారకరం.
2000 సంవత్సరం నుంచి ఈ రెండు దశాబ్దాల్లో 261 రకాల పక్షి జాతులను పరిశీలిస్తే.. వాటిలో 22 శాతం పక్షి జాతులు వేగంగా, 52 శాతం పక్షి జాతులు నిదానంగా కనుమరుగై పోతున్నాయి. అయితే వీటిలో 5 శాతం పక్షి జాతుల జనాభా మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడం కొంతవరకు సంతోషించదగిన విషయం. మన జాతీయ పక్షి నెమలి మాత్రం తన బలగాన్ని పెంచుకుంది. నెమలుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఊరపిచ్చుక, చిలుక, ఆసియా కోయిల, టైలర్‌బర్డ్ సహా దాదాపు 120 రకాల పక్షి జాతుల జనాభా మాత్రం పెరుగుదలగానీ, తరుగుదలగానీ లేకుండా స్థిరంగా కొనసాగుతున్నది.
స్వదేశీ పక్షి జాతులతో పోలిస్తే.. సుదూర దేశాల నుంచి వచ్చే వలస పక్షి జాతులు, భారత ఉపఖండంలోని ఇతర దేశాల నుంచి వచ్చే వలస పక్షి జాతుల జనాభా వేగంగా తరిగిపోతున్నది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షి జాతుల్లో.. ఫారెస్ట్ వ్యాగ్‌టెయిల్ (లకుముకి పిట్ట), పసిఫిక్ గోల్డెన్ ప్లోవర్ (ఉల్లంకి పిట్ట), కామన్ గ్రీన్‌షంక్ (బుడుబుంగ/నీటి పిట్ట) పక్షి జాతుల జనాభా స్పీడ్‌గా పడిపోతున్నది.
ఇక ప్రపంచంలోని ఇతర పక్షి జాతుల జనాభా కూడా శరవేగంగా పతనమవుతున్నది. వీటిలో సాధారణ పక్షి జాతుల జనాభా క్రమంగా తగ్గిపోతుండగా.. అరుదైన పక్షి జాతుల జనాభా అయితే మరీ దారుణంగా పడిపోతున్నది. అమెరికా, కెనడాల్లో సుమారు 300 కోట్ల పక్షులు కనుమరుగైనట్లు ఇటీవల ఓ అధ్యయనంలో బయటపడింది.
దేశంలోని అంతరిస్తున్న పక్షి జాతుల సంరక్షణ కోసం చట్టబద్దమైన ఏర్పాట్లు చేయాలని తాజా నివేదిక సూచించింది. అంటే 1972 నాటి వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఈ పక్షి జాతులకు కూడా వర్తింపజేసి పక్షుల వేటను నిలువరించాలని కోరింది. ఇక రెండోది పక్షులు అవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన వాతావరణం కల్పించాలని పేర్కొన్నది. అంటే ఆయా పక్షలకు కావాల్సిన తీరుగా అడవులను, పార్కులను తీర్చిదిద్దాలని ఈ నివేదిక స్పష్టంచేసింది.