మన పూర్వీకులు పెట్టిన ప్రతీ ఆచారంలో ఎన్నో మర్మాలు. మనకు వాటిలోతులు తెలియక వారిని మూఢులు అని ఛాందసులు అని అనుకున్నాం. కానీ కరోనా పుణ్యమా అని శుచి, శుభ్రత, దూరం, మడి తదితర ఆచారాల మర్మాలను మనం నేడు కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాం. అదే కోవలో శ్రీరామనవమినాడు చేసే వడపప్పు పానకం వెనుక సైన్స్ విశేషాలు తెలుసుకుందాం….
శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాములను భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. అనంతరం స్వామికి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తాం. అయితే వడపప్పు నైవేద్యం వెనుకు రహస్యం తెలుసుకుందాం…
శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వసంతరుతువులో వస్తుంది. శాస్త్రం ప్రకారం యమదంష్ట్రలు ఏటా రెండుసార్లు వస్తాయి. ఆ కాలంలో అనేకానేక వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా కాలాలో మనవారు కొన్ని కట్టుబాట్లను పెట్టారు. ఒకటి దసరా సమయంలో వర్షాకాల సమయంలో, రెండోది వసంత కాలంలో. ఈ కాలంలో వసంత నవరాత్రి పేరున పెట్టిన ఆచారం శ్రీరామనవరాత్రులు చేయడం. ఈసందర్భంగా పలురకాల ఆహారపు అలవాట్లను పెట్టారు. వాటిలో ప్రధానమైనది.. శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం ఉంది.
భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదే కాకుండా పానకం చలువ చేస్తుంది. విషహారిని కూడా. మన శరీరంలో ముఖ్యంగా కడుపులో, గొంతులో వుండే ఇన్‌ఫెక్షన్‌లను తొలగిస్తుంది. అలాగే పెసరపప్ప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తి అభివృద్ధి పరుస్తుంది, దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు. ఇది మండుతున్న ఎండలలో ‘వడదెబ్బ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. అందుకు మనవారు ఆయా కాలాలకు మేలుచేసే పదార్థాలను ప్రసాదం రూపంలో మనకు అందించారు. స్వధర్మో శ్రేయః పరధర్మో భయావహః అంటే ఇదే.
-శ్రీ