అవును.. బీరకాయ, కోడిగుడ్డు కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ మంది బీరకాయ కోడిగుడ్డు కాంబో వండుతుంటారు. కానీ.. ఈ కాంబో కూర ఎంతో రుచిగా ఉంటుంది. మరి.. బీరకాయ కోడిగుడ్డు కూరను వండేద్దాం పదండి.
బీరకాయ కోడిగుడ్డు కూర వండడానికి ఉడికించిన కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, లేత బీరకాయ ముక్కలు కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, ఆయిల్ ఉంటే చాలు.
ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి వాటిపైన కత్తితో గాట్లు పెట్టండి. ఓ గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసి వేడి చేయండి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి. తర్వాత ఉడకబెట్టిన గుడ్లను అందులో వేసి కాసేపు వేయించండి. ఉడకబెట్టిన గుడ్లను తీసి పక్కన పెట్టండి. ఆ మిశ్రమంలో బీరకాయ ముక్కలు వేసి ముతపెట్టండి. కాసేపటి తర్వాత కాసింత ఉప్పు, పసుపు వేయండి. బీరకాయ ముక్కలు ఉడికేదాక అలాగే ఉంచండి. ఒకవేళ బీరకాయ ముక్కలు ఉడకకపోతే కొన్ని నీళ్లు పోయండి. ఇందులో వేయించిన గుడ్లు, కారం, మసాలాలు వేసి బాగా కలిపండి. కాసేపు అలాగే సన్నటి మంట మీద ఉడికించండి. అంతే.. వేడి వేడి బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ.