పెరుగుతో చికెన్ కబాబ్ తయారు చేద్దాం ఇలా..

పెరుగుతో చికెన్ కబాబ్‌.. ఈ వంటకం పిల్లలకు తెగ నచ్చుతుంది. పెరుగు తినడం వల్ల శరీరం చల్లగా ఉండడంతోపాటు రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది. ఇందులో విటమిన్ కె, డి, ఫాస్పరస్ వీటితోపాటు ల్యాక్టో బాసిల్లస్ అనే బ్యాక్టీరియా శరీరంలో తెల్లరక్తకణాలను పెంచుతుంది. అలాగే ఉడికించిన చికెన్‌ను ఆహారంలో చేర్చుకుంటే కండరపుష్టి పొందవచ్చు. అందులోనూ గ్రిల్డ్ చికెన్, ఉడికించిన చికెన్‌ను తీసుకోవాలి. చికెన్‌లో ఉండే ప్రోటీనులు తగినంత శక్తినిచ్చి, శరీరంలోని నొప్పుల నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. పెరుగు, చికెన్ కాంబోలో పిల్లలకు తెగ నచ్చే కబాబ్ ఎలా చేయాలో చూద్దాం..

curd chicken kebab recipe in telugu
curd chicken kebab recipe in telugu – పెరుగుతో చికెన్ కబాబ్ తయారు చేద్దాం ఇలా..

కావాల్సినవి :
బోన్‌లెస్ చికెన్‌ముక్కలు : 1 కప్పు
పెరుగు : అరకప్పు
ఉల్లిగడ్డ : 1
అల్లం : చిన్నముక్క
వెల్లుల్లిరెబ్బలు : 4
ధనియాలపొడి : అర టీస్పూన్
నూనె : వేయించడానికి సరిపడా
గరంమసాలా : పావు టీస్పూన్
కారం : అర టీస్పూన్
మిరియాలపొడి : పావు టీస్పూన్
జీలకర్రపొడి : పావు టీస్పూన్
పచ్చిమిర్చి : 2
ఉప్పు : తగినంత

తయారీ :
బోన్‌లెస్ చికెన్‌ముక్కలను బాగా శుభ్రం చేసిపెట్టుకోవాలి. చికెన్‌ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లిని మిక్సీలో పట్టించి పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసుల్ని కూడా చికెన్‌తోపాటు గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పెరుగులో నీళ్లు లేకుండా పలుచని బట్టలో వడేయాలి. ఈ పెరుగు మిశ్రమంలో చికెన్ మిశ్రమం వేసి పావుగంట నానబెట్టాలి. తర్వాత ఈ ముద్దను గుండ్రంగా ముద్దలా చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. దీనిలో ఈ ముద్దను వేసి రెండువైపులా దోరగా వేగేంతవరకు ఉంచి కాల్చి తీసేయాలి. కబాబ్‌షేప్‌లో కావాలనుకుంటే.. ఈ చికెన్‌ముద్దను కబాబ్ స్టిక్‌సలో గుచ్చాలి. ఆ తర్వాత కాల్చి తీసేయొచ్చు. సర్వ్ చేసేటప్పుడు టమాటా సాస్, కెచప్‌లు తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.