బ్యాచిల‌ర్స్ ఫ‌స్ట్ చాయిస్ ఎగ్ బుర్జీ.. తయారు చేయండిలా..!

బ్యాచిల‌ర్స్ లేదా వంట చేసుకోవ‌డం కుద‌ర‌ని బిజీ ఉద్యోగుల ఫ‌స్ట్ చాయిస్.. ఎగ్ బుర్జీ. ఎందుకంటే దీన్ని త‌యారు చేయడం చాలా సుల‌భ‌మే కాదు, ఈ వంట‌కం త్వ‌ర‌గా అవుతుంది కూడా. అందుక‌నే చాలా మంది కూర చేసుకునేందుకు స‌మ‌యం లేక‌పోతే ఎగ్ బుర్జీ చేసుకుని తింటుంటారు. ఎగ్ బుర్జీని అన్నం లేదా చ‌పాతీల్లో తిన‌వ‌చ్చు. మ‌రి ఈ కూరను ఎలా వండాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఎగ్ బుర్జీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

వంట నూనె – 2 టీ స్పూన్లు
బ‌ట‌ర్ – 3 టీస్పూన్లు
వెల్లుల్లి (త‌రిగిన‌వి) – 1 టీస్పూన్
పచ్చి మిర‌ప‌కాయ‌లు (తరిగిన‌వి) – 2 టీస్పూన్లు
అల్లం (త‌రిగింది) – 2 టీస్పూన్లు
క‌రివేపాకులు – 6
ఉల్లిపాయ‌లు (త‌రిగిన‌వి) – అర క‌ప్పు
ఉప్పు – 3 టీస్పూన్లు
ప‌సుపు – 2 టీస్పూన్లు
కారం పొడి – 2 టీస్పూన్లు
పావ్ భ‌జ్జీ మ‌సాలా – ఒక‌టిన్న‌ర టీస్పూను
కొత్తిమీర (త‌రిగింది) – 1 టీస్పూన్
ట‌మాటాలు (త‌రిగిన‌వి) – అర కప్పు
కోడిగుడ్లు – 4
కొత్తిమీర ఆకులు – త‌గిన‌న్ని

ఎగ్ బుర్జీ త‌యారీ విధానం…

పాన్ తీసుకుని అందులో నూనె వేయాలి. బ‌ట‌ర్‌, వెల్లుల్లి, పచ్చిమిరప కాయ‌లు, అల్లం మిశ్ర‌మాల‌ను నూనెలో వేయాలి. బంగారు వ‌ర్ణం వ‌చ్చే వ‌ర‌కు ఆ మిశ్ర‌మాన్ని బాగా వేయించాలి. క‌రివేపాకులు, త‌రిగి పెట్టుకున్న ఉల్లిపాయ‌ల‌ను పాన్‌లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ మిశ్ర‌మంలో ఉప్పు, ప‌సుపు, కారం పొడి, పావ్ భ‌జ్జీ మ‌సాలాల‌ను వేసి బాగా తిప్పాలి. త‌రిగిన కొత్తి మీర ఆకులు, ట‌మాటాల‌ను వేసి బాగా తిప్పాలి. పాన్‌లో కోడిగుడ్లు కొట్టాలి. అనంతరం వాటిని బాగా వేయించాలి. మిశ్ర‌మం బాగా వేగాక అందులో బ‌ట‌ర్ పోయాలి. కొత్తిమీర ఆకుల‌తో అలంక‌రించాలి. అంతే.. వేడి వేడి ఎగ్ బుర్జీ త‌యార‌వుతుంది. దాన్ని చ‌పాతీలు, అన్నం లేదా బ్రెడ్‌తో ఆర‌గించ‌వ‌చ్చు.