నిప్పులు కక్కుతున్న ఎర్రని ఎండలో బయట తిరిగి వచ్చే సరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. దీంతో జనాలు చల్లని మార్గాల వైపు పరుగులు తీస్తున్నారు. చల్లని పానీయాలు తాగడం.. చల్లని ప్రదేశాల్లో ఉండడం చేస్తున్నారు. అయితే చల్లని పానీయాల విషయానికి వస్తే.. మనకు మండుటెండల్లో గులాబీ షర్బత్ బాగా చల్లదనాన్నిస్తుంది. గులాబీ, దానిమ్మ గింజల రసంలలో ఉండే చల్లని గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ క్రమంలోనే గులాబీ షర్బత్‌ను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
గులాబీ షర్బత్ తయారీకి కావల్సిన పదార్ధాలు:
గులాబీ రేకులు – ఒకటిన్నర కప్పులు
మరిగించిన నీళ్లు – ముప్పావు కప్పు
యాలకుల గింజలు – 1/4 టీస్పూన్
చక్కెర – ముప్పావు కప్పు
నిమ్మరసం – 1/4 కప్పు
దానిమ్మ గింజల రసం – ముప్పావు కప్పు
చల్లని నీళ్లు – 5 కప్పులు
గులాబీ షర్బత్ తయారు చేసే విధానం:
ముందుగా గులాబీ రేకులను మెత్తగా నూరుకోవాలి. ఆ తరువాత ఆ ముద్దను గిన్నెలో వేసి అందులో మరిగించిన నీళ్లు పోయాలి. అనంతరం యాలకుల గింజలు కూడా వేసి మూత పెట్టి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ గులాబీ నీటిని పలుచని వస్త్రంతో వడకట్టుకోవాలి. అనంతరం వచ్చే ద్రవంలో చక్కెర వేసి బాగా కలపాలి. తరువాత వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకుని అందులో వేడినీరు పోసి గులాబీ నీరు ఉన్న గిన్నెను అందులో ఉంచి చక్కెర కరిగే వరకు వేచి చూడాలి. తరువాత గిన్నెను బయటకు తీసి అందులో ఉన్న ద్రవాన్ని వడకట్టి చల్లార్చుకోవాలి. అనంతరం అందులో దానిమ్మ రసం, నిమ్మరసం, చల్లని నీళ్లు కలిపి గ్లాసుల్లో పోయాలి. అవసరం అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. దీంతో చల్ల చల్లని గులాబీ షర్బత్ తయారవుతుంది..!