మిక్స్డ్ వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలి అంటే ..!

కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బియ్యం, సరిపడా నీళ్లు , తరిగిన బీన్స్ ఇరవై గ్రాములు, ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ నలభై గ్రాములు, బంగాల దుంప ముక్క లు యాభై గ్రాములు, పచ్చి బఠాణీలు అరవై గ్రాములు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నలభై గ్రాములు, షాజీర ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క , లవంగాలు, పసుపు కొద్దిగా, వెల్లుల్లి, అల్లం పేస్ట్ కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ ల నూనె , జీడి పప్పు, కిస్ మిస్ లు పది.

తయారి విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్రషర్ కుక్కర్ పెట్టుకుని అందులో నూనె వేయాలి. నూనె కాగాక జీడిపప్పు, కిస్ మిస్ లను గోల్డెన్ కలర్ లో వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత లవంగాలు రెండు, దాల్చిన చెక్క, షాజీర వేయాలి.అందులో అల్లం,వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి. ఆ తరువాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి సగం పైగా వేగాక ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేయాలి.

చిన్న మంట పై వీటిని మగ్గించుకోవాలి. ఇవి నూనెలో మగ్గిన తరువాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకటికి రెండు కప్పుల నీళ్ళు పోయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రషర్ తగ్గిన తరువాత మూత తిసి ముందుగా వేయించుకున్న జీడి పప్పు, కిస్ మిస్ లతో గార్నిష్ చేసికోవాలి.అంతే మిక్స్డ్ వెజిటబుల్ రైస్ రెడీ.