మీ జీవితం పొడవుగా సాగడానికి మాంసాహారం మేలు చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

మీరు తీసుకునే ఆహారమే మీ జీవిత కాలాన్ని నిర్ణయిస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషణ సరిగ్గా అంది జీవక్రియ సరిగ్గా ఉంటుంది. దానివల్ల ఎక్కువకాలం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.

మరి శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఎలాంటి ఆహారాల ద్వారా అందుతాయి? గుడ్లు, మాంసం ద్వారా అధిక పోషకాలు శరీరానికి చేరుతాయా? ఆహారంలో ఎలాంటివి తీసుకుంటే ఎక్కువ కాలం వ్యాధుల బారిన పడకుండా ఉంటారో తెలుసుకుందాం.

ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన ప్రకారం గుడ్లు, మాంసం కూడా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలని అందించలేవు. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి కూరగాయలు, పండ్లు ఉత్తమమైనవి అని చెబుతున్నారు. రోజులో రెండు పండ్లు, రంగు రంగుల కూరగాయలను ఆహారంగా తీసుకోవడం ఉత్తమం అని భావిస్తున్నారు.

ఆకుపచ్చ కూరగాయలు అంతర్గత వ్యవస్థను బలోపేతం చేసి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ మార్చి 2021 లో విడుదల చేసిన దాని ప్రకారం పండ్లు, ఆకు కూరలు సరైన ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిపారు. రోజూ రెండు పండ్లు, మూడు కూరగాయలను తినడం వల్ల మేలు జరుగుతుందని చెప్పారు.

ఎలాంటి కూరగాయలు తినాలి?

పిండి పదార్థాలు తక్కువగా ఉన్న కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. ఆకు కూరల్లో బచ్చలి కూర, క్యాబేజీ ఇంకా బీటా కెరాటిన్ అధికంగా ఉండే క్యారెట్లు,చిలగడ దుంపలు, బ్రోకలీ.. సిట్రస్ ఫలాలైన జామ, నారింజ స్ట్రాబెర్రీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.