ఎర్రటి పుచ్చకాయను ఇలా గుర్తించండి?

భగభగమంటున్న భానుడి ప్రతాపానికి మనకు దాహం తీరడం లేదు. చల్లదనం కోసం మనం ఫ్రీజ్‌లు, ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నాం. ఇంకా మరో రెండు నెలల పాటు ఎండ ప్రభావం ఉంటుంది. అందుకే ఒంటì కి చల్లదనాన్ని ఇచ్చే ఆహారాన్ని కూడా తీసుకుంటాం. అందులో మన శరీరానికి ఎంతో మేలు చేసే పుచ్చకాయల సీజన్‌ కూడా ఇదే కదా! దీన్ని మనం కొనేటప్పుడు దాని లోపల భాగం ఎలా ఉందో మనకు తెలీదు. అయితే దాన్ని కోయక ముందే బయటి నుంచే ఎలా గుర్తించాలో మన పరిశోధకులు కొన్ని చిట్కాలను ఇచ్చారు. అవేంటో తెలుసుకుందాం. సాధరణంగా పుచ్చకాయని మన శరీర వేడిని తగ్గించుకోవడానికి తీసుకుంటాం. ఇది మన దాహాన్ని తీర్చి వేసవి తాపం నుంచి రక్షిస్తుంది. అందుకే ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్‌లో అనేక రకాల పుచ్చకాయలు అందుబాటులో ఉంటాయి. దాన్ని కోసిన తర్వాత కూడా 3–4 గంటల్లో తినేయాలి.

  • పుచ్చకాయను రెండు కేజీల కంటే ఎక్కువ బరువున్నది ఎంచుకోవాలి. ఏ రంగున్న ఫరవాలేదు.
  • దాని తొడిమ ఎండిపోయి ఉండాలి. తొడిమ లేదంటే ఆ ప్రాంతంలో ఎండిపోయి గట్టిగా ఉండాలి.
  • పుచ్చకాయ గట్టిగా, బరువుతో ఉండాలి. మెత్తబడితే లోపల భాగం పాడైనట్లు గుర్తించాలి.
  • పుచ్చకాయపై గోధుమ లేదా పసుపు మచ్చలుంటాయి. చారలతో సంబంధం లేకుండా మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే లోపల భాగం అంత ఎరుపుగా ఉంటుంది.
  • గట్టిగా, మచ్చలు ఉన్న పుచ్చకాయను ఎంచుకోవాలి. అప్పుడు దాన్ని కోయక పోయిన ఎర్రగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
  • కట్‌ చెయ్యని పుచ్చకాయని ఫ్రిడ్జ్‌లో లేదా ఎండ తగలని చోట రెండ్రోజులు ఉంచినా పాడవ్వదు.

ఇలా ఈసారి పుచ్చకాయను గుర్తించి కొనుక్కోండి. ఈ టిప్‌లు పాటిస్తే పుచ్చకాయను కోయకుండానే ఎరుపు రంగు ఉన్నదాన్ని సులభంగా గుర్తించవచ్చు.