Almonds : అమృతమయం… బాదం.

-

సాధారణంగా పాలను తల్లిలా భావిస్తుంటాం. మనల్ని తల్లిలా కాపాడే పోషకాలుంటాయి కాబట్టి. మరి తండ్రిలా దేన్ని అనుకోవాలి? ఇంక దేనిని.? బాదంపప్పు. జీవితాంతం మనల్ని మంచి ఆరోగ్యవంతులుగా పోషించే బాధ్యతను బాదం తీసుకుంటుంది. ప్రతిరోజూ బాదంపప్పును తింటే జీవితమంతా అమృతమయమే.

benefits of almonds soaked in water
benefits of almonds soaked in water

బాదం పప్పు – ఇంగ్లీషులో ఆల్మండ్‌గా పిలువబడే పప్పుదినుసు. మనం కొనే, తినే డ్రైఫ్రూట్లలో ముఖ్యమైన భాగస్వామి. ఇది బాదంకాయల్నుండి వచ్చే తినదగిన గింజ. నిజానికి బాదం, తూర్పుమధ్య దేశాలకు చెందినదయినా, ప్రస్తుతం అమెరికా అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. బాదంచెట్టు శాస్త్రీయనామం ‘ప్రునస్‌ డల్కిస్‌’.

సాధారణంగా షాపుల్లో తొక్క లేకుండా, తొక్కతో బాదంపప్పు దొరుకుతుంది. నేరుగా తినగలిగేట్లు వేయించినవి కూడా లభిస్తాయి. అయితే మామూలు బాదం కూడద తినొచ్చు. బాదంపప్పులో అద్భుతమైన పోషకాలున్నాయి. ఒక గుప్పెడు (143 గ్రాములు) బాదంలో పోషకాలు ఈ క్రిందివిధంగా ఉంటాయి.
• నీరు – 6.31 గ్రాములు; శక్తి- 828 కిలో కెలరీలు; పీచుపదార్థం – 17.9 గ్రాములు; మాంసకృత్తులు – 30.24 గ్రాములు; కొవ్వు – 71.4 గ్రాములు; మొత్తం చక్కెర – 6.01 గ్రాములు ; విటమిన్‌-ఇ – 36.65 మిల్లీగ్రాములు ; ఇనుము – 5.31 ఎం.జి ; మెగ్నీషియం – 386 ఎం.జి ; భాస్వరం- 688 ఎం.జి ; కాల్షియం – 385 ఎం.జి ; పొటాషియం – 1048 ఎం.జి ; పిండిపదార్థాలు – 30.82 గ్రాములు

ఇవేకాక, రాగి, విటమిన్‌-బి2 (రైబోఫ్లావిన్‌), జింక్‌, విటమిన్‌-బి6కూడా తగుపాళ్లలో ఉంటాయి. ముఖ్యమైన విషయమేమిటంటే, మన శరీరం దీన్లోని 10 నుంచి 15శాతం కెలరీలను గ్రహించలేదు. ఎందుకంటే కొంత కొవ్వు భాగం మనకు జీర్ణం కాదు. బాదంలో ఉండే ఫైటిక్‌ ఆమ్లానికి, ఖనిజపదార్థాలను కట్టిపడేసే గుణం ఉండటం వల్ల అవి జీర్ణం కావు. ఈ ఫైటిక్‌ ఆమ్లం, మంచి యాంటీఆక్సిడెంట్‌ అయినప్పటికీ, బాదం నుండి మనకు లభించే ఇనుము, జింక్‌, కాల్షియంలను కొంతమేరకు తగ్గిస్తుంది.

benefits of almonds soaked in water

బాదంలో ఉండే పై పోషకాలు శరీరానికి ఎంతో ముఖ్యమైనవి. ఈ స్థాయిలో పోషకాలను ఇచ్చే పదార్థం ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే దీన్ని ‘సూపర్‌ ఫుడ్‌’గా అభివర్ణిస్తున్నారు. ఇందులో ఉండే కొవ్వుపదార్థం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మంచి కొలెస్టరాల్‌ను ఎక్కువగానూ, చెడు కొలెస్టరాల్‌ను తక్కువగానూ చేస్తుంది. తద్వారా గుండెపోటు వచ్చే రిస్క్‌ చాలా తక్కువయిపోతుంది. పీచుపదార్థం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. మలబద్ధక సమస్య పూర్తిగా దూరమవుతుంది. షుగర్‌ పేషెంట్లలో ఈ ఫైబర్‌, బ్లడ్‌ షుగర్‌ను నియంత్రణలో ఉంచుతుంది. మెగ్నీషియం కండరాలకు బలం చేకూర్చి, మంచి ఫిట్‌నెస్‌ను అందిస్తుంది.

ఇక అమృతమయమైన విటమిన్‌-ఇ బాదంలో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో కలిసిపోయి, జీవకణాలను నాశనం కాకుండా కాపాడుతుంది. ఎర్రరక్తకణాలను ధృడంగా తయారుచేసి, చెడు కొలెస్టరాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక చర్మానికి, వెంట్రుకలకు జరిగే లాభం చెప్పే పనే లేదు. మెరిసిపోయే చర్మం, చిక్కటి, ధృడమైన జుట్టు మీ సొంతం. అలాగే, మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్‌) కూడా దరికి చేరదు.

బాదంపప్పు రోజూ తినేవారిలో కాన్సర్‌ వచ్చే ప్రమాదం మామూలు వారికంటే 2-3 రెట్లు తక్కువ. ఇది మధుమేహవ్యాధిగ్రస్తులకు వరం లాంటిది. రక్తంలో షుగర్‌ శాతాన్ని నియంత్రణలో ఉంచుతుంది. బహుశా, బాదంలో ఉండే హెచ్చు మోతాదు మెగ్నీషియం దీనికి కారణమని వైద్య పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టైప్‌-2 మధుమేహబాధితుల్లో మూడోవంతు మెగ్నీనిషియం తక్కువగా ఉన్నవాళ్లే.

Almonds: Health benefits, nutrition, and risks
Almonds: Health benefits, nutrition, and risks

బాదంపప్పులో పిండిపదార్థం తక్కువగా, మాంసకృత్తులు, పీచుపదార్థం ఎక్కువగానూ ఉండటం వల్ల, కడుపు నిండుగా అనిపించి, తక్కువ తింటారు. తద్వారా శరీరానికి తక్కువ కెలరీలు లభించి, అనవసర బరువు పెరగకుండా ఉంటారు.

ఆయుర్వేదంలో కూడా బాదంపప్పుకు ముఖ్యమైన స్థానం ఉంది. ప్రధానంగా పిత్త, వాత, కఫ దోషాలను సమగ్రంగా అరికడుతుందని ఆయుర్వేద వైద్యుల ఉవాచ. సప్తధాతువులను ఉత్తేజపరచగల తత్వం దీన్లో ఉందని, ముఖ్యంగా శుక్రధాతువు (పునరుత్పాదక ధాతువు)ను ఎంతో ప్రేరేపిస్తుందని ఆయుర్వేదం తెలిపింది, కఫ దోషమున్నవారు మాత్రం బాదంపప్పును మితంగా తినాల్సివుంటుంది. సాధారణంగా బాదం కొంచెం భారమైన గింజ కాబట్టి, దీన్ని అరిగించుకోవాలంటే జఠరాగ్ని బలంగా ఉండాలి.

ఎలా తినాలి.?

ఎవరిష్టం వారిది. ఎలా అయినా తినొచ్చు. కానీ, పోషకాహార నిపుణులు, వైద్యులు, ఆయుర్వేదం ప్రకారం…. అయిదారు పప్పులను రాత్రి నానబెట్టి, పొద్దున్నే పరగడుపున మీది పొట్టు తీసి తినడం ఎంతో మంచిది. రుచి కోసమే కాకుండా, ఒక ఆరోగ్యకరమైన సూచన ఇది. చాలా మందికి తెలియని విషయమేమిటంటే, గోధుమరంగులో ఉండే పై పొట్టు లేదా తొక్కలో ‘టానిన్‌’ అనబడే పదార్థముంటుంది. ఇది పోషకాల జీర్ణక్రియను అడ్డుకుంటుంది. నానిన బాదం వల్ల తొక్క సులువుగా వస్తుంది. తద్వారా పోషకాలు తొందరగా విడుదలవుతాయి. సులభంగా జీర్ణమవుతుంది కూడా. నానిన బాదం ‘లైపస్‌’ అనే కిణ్వాన్ని (ఎంజైమ్‌) కలిగివుంటుంది. ఇది కొవ్వులను కరిగించడంలో దిట్ట.

Almonds: Health benefits, nutrition, and risks
Almonds: Health benefits, nutrition, and risks

గొప్ప సౌందర్య సాధనం

ఈజిప్టు రాణి క్లియోపాత్రా, అందమైన చర్మానికి, జుట్టుకు చాలా పేరుగాంచింది, ఆమె తన ఆహారంలో, సౌందర్యపోషణలో బాదంను తప్పనిసరిగా చేర్చేదని చరిత్ర చెబుతోంది. విటమిన్‌-ఇ సమృద్ధిగా గల బాదం చర్మం నిగారింపుకు, సున్నితత్వానికి సమర్థవంతమైన పోషకం. బాదంనూనెతో మర్థనా చేస్తే, అన్ని రకాల చారలు, మరకలు పోయి చర్మం నిగనిగలాడుతుంది. కళ్లకింది చారలను కూడా నిరోధిస్తుంది. తలకు మర్థనా చేసినట్లయితే, ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల తలమీది చర్మం తైలాన్ని పీల్చుకుని, రక్తప్రసరణ పెరిగి, జుట్టు పెరుగుదలకు, రాలిపోవడాన్ని అరికట్టేందుకు దోహదం చేస్తుంది.

బాదం సుగుణాల గురించి మాట్లాడాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఆరోగ్యానికి, అందానికి, రోగ నిరోధానికి, చురుకుదనానికి, మేధస్సుకు అద్భుతంగా ఉపయోగపడే అపురూప ఔషధం. ఎన్నోరకాల స్వీట్లు, పాయసాలకు తనివి తీరని రుచిని ఆపాదిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.? నేడే బాదంను మీ ఆహారంలో చేర్చుకోండి. నిండునూరేళ్లు, అందంగా, ఆరోగ్యంగా జీవించండి.

– చంద్రకిరణ్‌

Read more RELATED
Recommended to you

Latest news