వర్షాకాలంలో పాములు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడంటే చాలామంది అపార్ట్మెంట్లలో ఉంటున్నారు, వారికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ఇళ్లలో ఇప్పటికి వానాకాలంలో పాములు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పల్లెటూర్లలో పొలాలలో, పాములు సహజంగా చుట్టుపక్కల పరిసరాల్లోకి వస్తుంటాయి. పాము కాటు ఘటనలు జరుగుతుంటాయి. అలా పాము కాటు వేసినప్పుడు భయపడకుండా వెంటనే మనం తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం..
పాము కాటు వేసిన వెంటనే మనం కంగారు పడిపోతూ భయపడతాం, అలా భయపడటం వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్త ప్రసరణ ఎక్కువ వేగంగా జరుగుతుంది.వెంటనే విషం కూడా శరీరంలోకి వేగంగా వ్యాపిస్తుంది. అందుకే పాము కాటుకి గురి అయిన వెంటనే బాధితున్ని ప్రశాంతంగా ఉంచడం మొదటిగా చేయాల్సిన పని.
కాటు వేసిన చోట వెంటనే సబ్బుతో, నీటితో కడగడం, గట్టిగా రుద్దడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే ఆ పాము కాటు వేసిన ప్రదేశం డాక్టర్ గుర్తించడం లో లోపం జరుగుతుంది.
పాము కాటు వేసిన తర్వాత ఆ ప్రదేశం నుండి విషం పాకకుండా ఉండడానికి బ్యాండేజ్ ని వాడొచ్చు లేదంటే ఏదైనా ఒక మెత్తటి బట్టతో ఆ ప్రదేశాన్ని వదులుగా కట్టాలి. కొంతమంది విషం పైకెక్కుతుందని గట్టిగా బిగించి కడతారు అలా ఎప్పటికీ చేయకూడదు అలా బిగించడం వల్ల నరాలు దెబ్బతింటాయి అందుకే మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ గా కాకుండా మెత్తటి బట్టతో కట్టాలి.
పాము కాటు వేసినప్పుడు ఆ పాముని మనం చూస్తే అది ఏ రంగులో ఉంది ఎలాంటి ఆకారంలో ఉంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇది డాక్టర్ కి చెప్పడం ముఖ్యం ఎందుకంటే చికిత్సకు ఇది సహాయపడుతుంది.
ఇక ముఖ్యంగా వీలైనంత తొందరగా ఆస్పత్రికి చేరుకొని వైద్యుడు సలహా తీసుకోవాలి. మీరు ఏ ప్రదేశంలో ఉన్నా పాము కాటు వేసిన వెంటనే 108 కి కాల్ చేయాలి.
ముఖ్యంగా పాము కాటు వేసినప్పుడు అక్కడ గాయాన్ని కోయడం, లేదంటే నోటితో పీల్చడం లాంటివి మాత్రం అసలు చేయకూడదు. అలానే ఆ టైంలో మద్యం, కెఫిన్ అలాంటి పదార్థాలను తీసుకోకూడదు. ముఖ్యంగా గాయం పై ఎలాంటి మందులు పూతగా రాయకూడదు. అలానే ఐస్ పెట్టడం వేడి, నీటిని పోయడం లాంటివి చేయకూడదు. బాధితున్ని ప్రశాంతంగా భయపడకుండా, ఆసుపత్రికి చేర్చడం అనేది చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల్లో పొలాలకు వెళ్లేటప్పుడు షూస్ వేసుకోవడం, ఏదైనా బయట ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖ్యం గా వానాకాలంలో చెప్పులను ధరించడం జాగ్రత్తగా చూసి నడవడం లాంటివి అలవాటు చేసుకోవాలి.
Note: (ఇందులో అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే, ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్న, ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.)