సమాజాన్ని అభివృద్ధి చేయడంని ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. అందులో భాగంగా వివిధ వర్గాల సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరి శక్తి మేరకు వారు సేవా కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. హైదరాబాద్ లో హర్యానా నాగరిక్ సంఘ్ (హెచ్.ఎన్.ఎస్) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘హెచ్.ఎన్.ఎస్ చికిత్సాలయ్’ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్.ఎన్.ఎస్ చికిత్సాలయ్ చైర్మన్ అంజనీకుమార్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎంపీ ఈటల రాజేందర్, హెచ్.ఎన్.ఎస్ అధ్యక్షులు పదమ్ జైన్, సలహాదారులు రామ్ గోయల్, హెచ్.ఎన్.ఎస్ చికిత్సాలయ్ అధ్యక్షులు పురుషోత్తం అగర్వాల్ హాజరయ్యారు.
సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తూ.. దేశ ప్రగతికి వైద్య సేవలు పునాది లాంటివని, కులం, మతం, ప్రాంతం, భాష అనే బేధాలు లేకుండా వైద్య సేవలు ప్రజలందరికీ అందాలన్నారు. ప్రజలు సమాజంలో తమ విధులు, బాధ్యతలను నిర్వర్తించకుండా హక్కులను అనుభవించలేరని గవర్నర్ స్పష్టం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని, అందుకోసం రాజ్ భవన్ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వం జారీచేసిన తెల్ల రేషన్ కార్డుదారులకు తమ చికిత్సాలయ ఉచితంగా వైద్య సేవలను అందించేందుకు చర్యలు చేపడుతామన్నారు.