మనం నిత్యం ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా సరే.. మనకు కనీసం 2500 క్యాలరీ శక్తి కావాలి. అయితే 3500 క్యాలరీల శక్తిని ఖర్చు చేస్తే అప్పుడు మనం 1 పౌండు వరకు బరువు తగ్గుతాం.
ప్రస్తుత తరుణంలో అధిక బరువును తగ్గించుకునేందుకు ఎంతో మంది నానా రకాల తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, వేళకు భోజనం చేయడం.. వంటి అనేక పద్ధతులను పాటిస్తున్నారు. కొందరు యోగా, ఎరోబిక్స్, స్విమ్మింగ్ వంటివి కూడా చేస్తున్నారు. అయితే ఇన్ని చేసినా ఎంతకీ బరువు తగ్గడం లేదని కొందరు వాపోతుంటారు. కానీ పాపం.. అందులో వారి తప్పేమీ ఉండదు లెండి. కొందరి శరీర తత్వం అలాగే ఉంటుంది. ఎన్ని వ్యాయామాలు చేసినా వారు అలాగే ఉంటారు. అయితే వీరి సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనకు మార్కెట్‌లో చాలా మంది వారంలోనే 10 కిలోల బరువు తగ్గిస్తాం, ఒక్క రోజులోనే 3 నుంచి 5 కిలోల వరకు బరువు తగ్గిస్తాం అంటూ ఊదరగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇంతకీ అసలు ఇది సాధ్యమవుతుందా..? అసలు ఒక రోజులో కనీసం మనం 1 కిలో బరువు అయినా తగ్గవచ్చా..? డాక్టర్లు ఏం చెబుతున్నారు..? తెలుసుకుందామా..!
మనం నిత్యం ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా సరే.. మనకు కనీసం 2500 క్యాలరీ శక్తి కావాలి. అయితే 3500 క్యాలరీల శక్తిని ఖర్చు చేస్తే అప్పుడు మనం 1 పౌండు వరకు బరువు తగ్గుతాం. 1 పౌండ్ అంటే 0.45 కేజీలు అన్నమాట. అంటే నిత్యం మనం సుమారుగా 7700 కు పైగా క్యాలరీను ఖర్చు చేస్తే అప్పుడు 2.2 పౌండ్ల (1కేజీ) బరువు తగ్గవచ్చన్నమాట. అయితే 7700 క్యాలరీలను నిత్యం ఖర్చు చేయాలంటే.. అందుకు మనకు చాలా సమయమే పడుతుంది.. ఎలా అంటే..?
మనం పలు రకాల ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నిమిషానికి ఇన్ని, గంటకు ఇన్ని అని క్యాలరీలు ఖర్చవుతాయి కదా. ఆ లెక్కన చూస్తే 7700 క్యాలరీలను ఖర్చు చేయాలంటే రన్నింగ్ అయితే సుమారుగా 17.5 గంటల పాటు చేయాలి. అదే వాకింగ్ అయితే అంతకు డబుల్ చేయాలి. ఇక స్విమ్మింగ్ అయితే ఆపకుండా 12 గంటల పాటు చేయాలి. అలాగే యోగా అయితే 30 గంటలు, సైకిల్ తొక్కడం అయితే 18 గంటలు చేస్తే.. 7700 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. ఏంటీ.. వినేందుకే షాకింగ్ ఉందా.. అవును మరి.. మన శరీరంలో 1 కిలో బరువు తగ్గించుకునేందుకు అంతటి శ్రమ పడాల్సి ఉంటుంది కదా.. అలాంటిది ఒక్క రోజులోనే 3 నుంచి 5 కేజీలు, 10 కేజీల వరకు బరువు తగ్గిస్తామని ఎవరైనా చెబితే మనం ఎలా నమ్ముతాం చెప్పండి. పైన వేసుకున్న లెక్క అయితే ఒక్క రోజులో 1 కిలో బరువు తగ్గేందుకే నానా అవస్థలు పడాలి. కానీ అదేమీ లేకుండా అంత పెద్ద ఎత్తున ఒకే రోజులో బరువు తగ్గిస్తామని చెప్పే వారి ప్రకటనలను చూసి మోసపోకండి.. తస్మాత్ జాగ్రత్త..!