ఆడాళ్ల ‘వయాగ్రా’ వచ్చేస్తోంది….!

-

ఇప్పటిదాకా శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు మగాళ్లకు మాత్రమే ‘వయాగ్రా’ ఉండటం చాలామందికి నచ్చేదికాదు. ముఖ్యంగా ఆడవారికి, వైద్యులకు. ఇప్పడిక ఆ బెంగ తీరిపోనుంది. మొన్నీమధ్యే ఆమెరికా ఎఫ్‌డిఎ మహిళల కోసం తయారుచేయబడ్డ ‘ఫిమేల్‌ వయాగ్రా’ను మార్కెట్లోకి అనుమతించింది.

గత శుక్రవారం, అమెరికన్‌ ఫెడరల్‌ డ్రగ్‌ ఏజెన్సీ (ఎఫ్‌డిఎ) మహిళల శృంగారవాంఛను ఉత్తేజపరిచేందుకు తయారుచేయబడిన ఒక మందుకు పచ్చజెండా ఊపింది. ‘వైలీసీ’ అనే పేరు కలిగిన ఈ మందును ఇప్పటికే ఫిమేల్‌ వయాగ్రా అని పిలుస్తున్నారు. తక్కువ లేదా అసలు శృంగారపరమైన కోరికలు లేని మహిళల సమస్యకు సమాధానంగా ఈ మందును పేర్కొంటున్నారు. అయితే ఈ మందు కూడా వివాదాలేమీ లేకుండా రాలేదు.

వైలీసీ, నిజానికి బ్రెమెలనాటైడ్‌ అనే జెనరిక్‌ మందుకు వ్యవహారనామం. అయితే వైలీసి ఈ విషయంలో మొదటిదేమీ కాదు. 2015లోనే ‘అడ్డి’ అనే మందును కనుగొన్నారు. మెనోపాజ్‌ వయస్సు కంటే చిన్నవాళ్లయిన మహిళల్లో హెచ్‌ఎస్‌డిడి (హైపోయాక్టివ్‌ లో సెక్సువల్‌ డిజైర్‌ డిసార్డర్‌) అనే ఒకానొక బలహీనతపై పోరాడేందుకు ఈ మందును ఉపయోగించారు. దీన్ని టాబ్లెట్ రూపంలో రోజూ వాడాల్సిఉంటుంది. వైసీలి కూడా ఇదే కారణంపై పోరాడుతుంది కానీ, టాబ్లెట్‌ రూపేణా కాకుండా ఇంజెక్షన్‌ రూపంలో ఉంటుంది. అలాగే రోజువారీ వాడకం కాకుండా శృంగారంలో పాల్గొనడానికి ముందు మాత్రమే వినియోగించాల్సివుంటుంది. వైలీసిని ఈ సెప్టెంబరులో విడుదల చేస్తామని తయారీదారులు ప్రకటించినా, ధర, మిగతా వివరాలు మాత్రం వెల్లడించలేదు.

హెచ్‌ఎస్‌డిడి ఉన్న మహిళల్లో శృంగారవాంఛ కొరవడటానికి శారీరక, మానసిక ఆరోగ్యం కారణం కాదనీ, ఆ స్త్రీ,పురుషుల సంబంధం కూడా కాదని ఐకేన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. స్టీఫెన్‌ స్నైడర్‌తెలిపారు. ‘ఈ రకమైన బలహీనత ఉన్నవారు అంతా బాగానేఉంటారు. తమ భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు. వారితో శృంగారం పంచుకోవాలని ఆశిస్తారు. కానీ ఎందుకనో ఆ సమయంలో ఆ వాంఛను కోల్పోతారు’ అని ఆయన స్పష్టం చేసారు.

వైలీసి, శృంగారానికి దాదాపు 45 నిమిషాలకు ముందు తొడకు గానీ, కడుపుకు గానీ ఇంజెక్షన్‌ చేయగానే, తన పనిని ప్రారంభిస్తుంది. అది మెలనోకార్టిన్‌ అనే హార్మొన్ల గుంపును ఉత్తేజపరుస్తుంది. ఈ హార్మోనే మహిళల్లో శృంగారవాంఛను, ఆకలిని నియంత్రిస్తుంది. అయితే ఇది నిజంగా ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ సరిగ్గా తెలియదని ఎఫ్‌డిఎ ఒక ప్రకటనలో తెలిపింది. వయాగ్రా పనిచేసే విధానానికి, దీనికి ఎంతో తేడా ఉందని చెపుతున్నారు.

వివాదాలు కూడా వైలీసిని చుట్టుముట్టే ఉన్నాయి. ఈ మందు వేసుకున్నాక, వికారంగా అనిపించిందని ప్రయోగాల్లో పాల్గొన్న 40శాతం మహిళలు చెప్పారు. అయితే తమలో వాంఛ ప్రబలిందని 25శాతం మంది ఒప్పుకోవడం విశేషం. అలాగే బిపి ఉన్నవారు, హృదయసంబంధిత వ్యాధులున్నవారు దీన్ని వాడకూడదని ఎఫ్‌డిఎ హెచ్చరించింది. ఏదేమైనా ఈ విషయంలో స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా వాటా లభించిందని కొందరు చమత్కరించగా, మరికొందరు సన్నిహితత్వం, భావోద్వేగాలను విస్మరించి వాంఛ రేగడం సమాజానికి అంత మంచిదికాదని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news