ఈ రోజుల్లో బ్రేకప్ అవ్వడం సర్వసాధారణమైపోయింది. అది ప్రేమికుల మధ్య అయినా.. దంపతుల మధ్య అయినా.. ఇద్దరు కలిసి ఉండలేం అనుకుంటే విడిపోతున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి జీవించి ఒక్కసారిగా విడిపోయిన తర్వాత వారిని మరిచిపోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అదే బ్రేకప్ సాడ్‌నెస్. ఈ బ్రేకప్ బాధ నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని చెబుతున్నారు మానసిక నిపుణులు. లేకపోతే క్రమంగా అది డిప్రెషన్‌కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. బ్రేకప్ బాధ నుంచి బయటపడటం అంటే అంత ఈజీ కాదు. మరి ఆ బాధ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..? అలాంటి వారి కోసమే మానసిక నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటంటే..?
మీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి.. బంధంలో ఉన్నప్పుడు ఎదుటివారి కోసం తమను తాము మార్చుకుంటూ, సర్దుకుంటూ వెళుతుంటారు. బ్రేకప్ అయినప్పుడు తమ కోసం తాము తిరిగి ఆలోచించడం మొదలుపెట్టాలి. వ్యక్తిగత పనులకు ప్రాముఖ్యతనిచ్చుకోవాలి. మనసులో కలిగే ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడటానికి సొంతంగా తమకుతాము సాయం చేసుకోవాలి. ఖాళీగా ఉండకుండా బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి. విడిపోయిన వ్యక్తితో అన్నిరకాల బంధాలను దూరంగా ఉంచాలి. వారిని సోషల్‌మీడియాలోనూ అన్‌ఫాలో అవ్వాలి.
నలుగురితో కలిసి ఉండాలి.. ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యులు, స్నేహితులు, పెద్దవాళ్ల చేయూత తీసుకోవాలి. అలాకాకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడితే క్రమేపీ కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మనసులో ఆందోళనను స్నేహితులు లేదా శ్రేయోభిలాషులతో పంచుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. వారందించే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తే విడిపోయిన భావన నుంచి బయటపడొచ్చు.
హెల్దీ ఫుడ్ తీసుకోవాలి.. పోషకవిలువలున్న ఆహారం, కంటి నిండా నిద్ర వంటివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎంతటి సమస్యనైనా తట్టుకోగలిగి, ఆలోచించగలిగే సామర్థ్యాన్ని మెదడుకిస్తాయి. మానసికారోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మనసుకు నచ్చిన చిత్రలేఖనం, పుస్తకపఠనం, నృత్యం, పుస్తకరచన వంటి అభిరుచులను బయటికి తీయాలి. ఏది సంతోషాన్నిస్తుందో గుర్తించి అందులో నైపుణ్యాలను పెంచుకోవాలి. దీంతో ఒంటరిననే భావం నుంచి బయటపడొచ్చు.
ఈ చిట్కాలు అన్నీ ట్రై చేసినా మీరు బ్రేకప్ బాధ నుంచి బయటపడలేదంటే అది డిప్రెషన్‌కి దారి తీసినట్టే. అందుకే వీలైనంత త్వరగా మానసిక నిపుణులను సంప్రదించాలి. వారి సలహాలు, సూచనలను పాటిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. మనసుకు నచ్చని బంధాన్ని కష్టంగా కొనసాగించడం కన్నా, దూరంగా ఉండటమే మంచిదనే ఆలోచన మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. తీసుకున్న నిర్ణయం సరైనదనే నమ్మకం మీపై మీకు ముందుగా రావాలి. అప్పుడే జీవితంలో మరో అడుగు ధైర్యంగా ముందుకు వేయగలరు. మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ లైఫ్‌ని హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయండి.