మొలకెత్తిన పెసలను రోజూ తింటే..?

పెసలు భారతీయుల ఆహారం. మన దేశంలో పూర్వీకుల నుంచి వీడి వాడకం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా మూంగ్ దాల్ అని పిలిచే ఇష్టమైన స్నాక్ ఐటమ్ పెసలే. ఇంతకీ పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పెసలు అంటేనే మనకు గుర్తుకొచ్చేది పులగం. కూరల్లో పెసలను వాడుతారు. పెసర దోశ రుచికరంగా ఉంటుంది. ప్రస్తుతం మొలకెత్తిన పెసలు, మూంగ్‌దాల్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. రుచితోపాటు ఆరోగ్యాన్నిచ్చే పెసలంటే అందరికీ ఇష్టమే.

1. పెసల్లో విటమిన్ బి, సి, మాంగనీస్‌తోపాటు ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా పెసలు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యలు పెసలు ఆహారంగా తీసుకోవడం వల్ల తొలగిపోతాయి. అంతేనా.. ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

2. సున్నిపిండి తయారీలో పెసలను ఉపయోగిస్తారు. దీని వల్ల చర్మంలో మృదుత్వం పెరుగుతుంది.

3. పెసలు హైబీపీని తగ్గిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పెసలు తింటే ఆరోగ్యంతోపాటు చురుకుదనం కూడా వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

4. పెసలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజు వారీ ఆహారంలో పెసల్ని భాగం చేసుకుంటే అనీమియా తదితర వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

5. బరువు తగ్గాలనుకునే వారికి పెసలు అద్భుతంగా ఉపయోగపడతాయని పరిశోధకులు అంటున్నారు. రోజూ బియ్యంలోకి కాసిన్ని పెసలను కలిపి పులగం చేసుకుని తింటే ఊహించని రీతిలో బరువు తగ్గవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

6. డయాబెటిస్‌ను క్రమబద్దీకరించడానికి పెసలు ఉపయోగపడతాయి. క్యాన్సర్ బారిన పడకుండా చేస్తాయి.

7. జీర్ణం సులువుగా అయ్యేందుకు సహాయపడే ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు.

8. పెసలు తినడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బ తినదు. కండరాల నొప్పి, తలనొప్పి, నీరసాన్ని తగ్గించే గుణం వీటికి ఉంది.

9. రోజు వారీ మెనూలో పెసలు ఉండడం వల్ల శరీరంలోని అనవసరమైన కెమికల్స్ నాశనం అవుతాయి. కంటి చూపు సమస్యలు దరి చేరవు.