కోడిగుడ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు గుడ్లలో ఉంటాయి. గుడ్లను తినడం వల్ల మనకు సరైన పోషణ అందుతుంది. అయితే కోడిగుడ్ల విషయానికి వస్తే రోజుకు ఎన్ని తినాలి, ఎంత తింటే మంచిది వంటి సందేహాలు అనేక మందికి కలుగుతుంటాయి. మరి నిజానికి అసలు కోడిగుడ్లను ఎన్ని తింటే మంచిదో తెలుసా..?
ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు 2 కోడిగుడ్లను తినవచ్చు. ఇక డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు, అధికంగా బరువున్నవారు రోజుకు 1 గుడ్డు మాత్రమే తినాలి. రెండో గుడ్డు తినదలచుకుంటే గుడ్డు లోపలి పచ్చ సొన తీసేయాలి. ఎందుకంటే దాంతో శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అదే ఒక పచ్చ సొన అయితే ఏమీ కాదు. ఎలాగూ మన శరీరానికి నిత్యం తగిన మోతాదులో కొలెస్ట్రాల్ అవసరమే. కనుక రోజుకు ఒక గుడ్డు పచ్చ సొనతో సహా తినవచ్చు. కానీ ఒకటి కన్నా ఎక్కువ తినదలిస్తే కచ్చితంగా పచ్చ సొన తీసేయాలి.
ఆరోగ్యవంతమైన వ్యక్తులు అయినా సరే రోజుకు 2 గుడ్లను మించరాదు. ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు వస్తాయి. ఇక కోడిగుడ్లను పచ్చిగా, ఆమ్లెట్ గా కన్నా ఉడకబెట్టుకుని తింటేనే మనకు ఎక్కువగా లాభం ఉంటుంది.