ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ ఎంత అవసరమో సరైన విశ్రాంతి కూడా అంతే అవసరం. ఐతే చాలా మందికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు. ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా నిద్రాదేవి కళ్ళమీదకి రాక అలా చూస్తూనే ఉంటారు. ఐతే నిద్ర సరిగ్గా రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మనిషికి శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయింది. చుట్టూ మెషీన్లు, ఏది కావాలన్నా కాలు కదపకుండానే అన్నీ దగ్గరికే వచ్చేస్తున్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో శారీరక శ్రమ తక్కువగా మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఐతే సరైన నిద్ర రావాలంటే మనసు అలసిపోతే రాదు శరీరం అలసిపోవాలి.
శరీరం అలసట చెందకుండా ఎంతగింజుకున్నా నిద్ర రాదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా అనుభవించే వాళ్ళు తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటే నిద్ర రాకపోవడం అనే సమస్య ఉండదు. అందుకోసం వ్యాయామం చేయడంతో పాటు, మీకిష్టమైన ఆటలు( ఫిజికల్ గా శ్రమ కలిగించేవి) ఆడటం బెటర్. అయినా సరే నిద్ర సరిగ్గా పట్టట్లేదంటే మానసికంగా మీరేదో ఆలోచిస్తూ ఉన్నారన్న మాట. మీకు తెలియకుండానే దేనిగురించో బాధపడుతూ ఉంటున్నారన్న మాట. అదేంటో తొందరగా కనిపెట్టండి. బాధ ఏదైనా పడుకునే ముందు దాన్ని మెదడులోంచి తీసేసి అటకమీద పడేయండి. ఈ రోజు మీరు సరిగ్గా నిద్రపోకపోతే రేపు ఉదయం సరిగ్గా తెల్లవారదు.
ఉదయం చికాగ్గా మొదలైతే ఆ రోజంతా అలానే ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఉదయం హుషారుగా లేవాలంటే రాత్రి హుషారుగా నిద్రపోవాలి. మనసులో ఉన్నవన్నీ పక్కనపెట్టినపుడే ఆ హుషారు కనిపిస్తుంది.
నిద్ర రాకపోవడానికి మరో ముఖ్య సమస్య మనం తీసుకునే ఆహారం. కాఫీ, టీ ల వల్ల నిద్ర చెడిపోతుంది. అందుకే సరిగ్గా నిద్రపోదామనుకునే వాళ్ళు వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. అలాగే పడుకునే ముందు ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవద్దు. లైట్ గా ఉండే ఆహార పదార్థాలని తీసుకోవడం ఉత్తమం.