ఉదయాన్నే గొంతులో చాయ్ బొట్టు పడనిదే చాలా మందికి సహించదు. ఏ పనీ చేయబుద్ది కాదు. టీ తాగిన తరువాతే చాలా మంది తమ దైనందిన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అయితే సాధారణ టీకి బదులుగా ఆ సమయంలో ఉల్లిపాయల టీ తాగితే ఎంతో మంచిది. దాంతో మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో.. ఉల్లిపాయల టీని అసలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!
ఉల్లిపాయల టీని ఇలా తయారు చేయాలి…
కావల్సిన పదార్థాలు:
తరిగిన ఉల్లిపాయ – 1
వెల్లుల్లి రెబ్బలు – 2 లేదా 3
బిర్యానీ ఆకు – 2
తేనె – 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు – 2 కప్పులు
తయారీ విధానం:
ఒకపాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి 2 నుంచి 4 నిమిషాల పాటు మీడియం మంటపై మరిగించాలి. అనంతరం మరుగుతున్న నీటిలో తరిగిన ఉల్లిపాయలను వేయాలి. 2 నిమిషాల తరువాత వెల్లుల్లి రెబ్బలను నలిపి అందులో వేయాలి. అనంతరం బిర్యానీ ఆకులను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేయాలి. మరో 10 నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని మరగనివ్వాలి. దీంతో ఆ నీరు డార్క్ బ్రౌన్ రంగులోకి మారుతుంది. అంతే.. ఉల్లిపాయల టీ తయారైనట్లే. అందులో కొద్దిగా తేనె కలుపుకుని దాన్ని వేడిగా ఉండగానే తాగేయాలి. ఇలా నిత్యం ఉదయాన్నే ఈ టీ తాగితే మనకు అనేక లాభాలు కలుగుతాయి.
ఉల్లిపాయల టీతో కలిగే లాభాలు…
* దగ్గు, జలుబు ఉన్న వారు ఉల్లిపాయల టీ తాగితే వెంటనే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జ్వరం కూడా తగ్గుతుంది. శ్వాస కోశ సమస్యలకు ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది.
* హైబీపీ ఉన్నవారు ఉల్లిపాయల టీని తాగితే బీపీ తగ్గుతుంది. రక్తసరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
* టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం ఉల్లిపాయల టీని తాగితే మంచిది. వారిలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ వల్ల ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో అవయవాలు శుభ్రంగా మారుతాయి.
* ఉల్లిపాయల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.