షాకింగ్.. లైఫ్‌స్టైల్ వ్యాధులు ఎక్కువ‌గా కేర‌ళ‌వాసుల‌కే వ‌స్తున్నాయ‌ట‌..!

-

మ‌న దేశంలో అక్ష‌రాస్య‌త శాతంలోనే కాదు, ఆరోగ్య‌ప‌రంగానూ కేర‌ళ మొద‌టి స్థానంలో ఉంది. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇప్పుడు ఆ రాష్ట్రం జీవ‌న‌శైలి (లైఫ్ స్టైల్‌) వ్యాధులు అధికంగా వ‌స్తున్న రాష్ట్రాల్లోనూ మొద‌టి స్థానంలో ఉంద‌ట‌. కేర‌ళ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఎక‌నామిక్ రివ్యూ-2018లో ఈ విష‌యం తెలిసింది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో ఓ నివేదిక‌ను కూడా ఇచ్చింది. అందులో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… కేర‌ళ ఇప్పుడు దేశంలోనే అత్య‌ధికంగా లైఫ్ స్టైల్ వ్యాధులు వ‌స్తున్న రాష్ట్రాల్లో మొద‌టి స్థానంలో నిలిచింది.

డ‌యాబెటిస్‌, హైప‌ర్‌టెన్ష‌న్‌, క‌రోన‌రీ హార్ట్ డిసీజ్‌, క్యాన్స‌ర్ త‌దిత‌రాల‌ను నాన్ క‌మ్యూనికేబుల్ డిజీసెస్ (ఎన్‌సీడీ) అని వ్య‌వ‌హ‌రిస్తారు. అంటే.. ఈ వ్యాధులు అంటు వ్యాధులు కావ‌న్న‌మాట‌. ఇక దేశంలోనే ఈ ఎన్‌సీడీల వ‌ల్ల చ‌నిపోతున్న‌వారి శాతం 42 ఉండ‌గా, కేర‌ళ‌లో అది ఏకంగా 52 శాతం ఉంది. అంటే దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే ఎన్‌సీడీల వ‌ల్ల చ‌నిపోతున్న‌వారు కేర‌ళ‌లోనే ఎక్కువ‌గా ఉన్నార‌న్న‌మాట‌. అది కూడా 30 నుంచి 59 సంవ‌త్స‌రాల మధ్య వయ‌స్సున్న వారే ఈ వ్యాధుల బారిన ప‌డి ఎక్కువ‌గా చనిపోతున్నార‌ట‌.

ప్ర‌పంచబ్యాంక్‌, నీతి ఆయోగ్ లు ఇచ్చిన హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్‌లో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్న‌ది కేర‌ళలోనే అని వెల్ల‌డైంది. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఎన్‌సీడీల బారిన ప‌డుతున్న వ్య‌క్తులు కూడా కేర‌ళ‌లోనే ఎక్కువ‌గా ఉన్నార‌ట‌. ఇది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని షాక్‌కు గురి చేసింది. అయితే మ‌రొక నివేదిక చెబుతున్న ప్ర‌కారం.. కేర‌ళ‌లో ప్ర‌తి 100 మంది యువకుల్లో 27 శాతం మందికి డ‌యాబెటిస్ ఉంద‌ట‌. జాతీయ స్థాయిలో ఇది 15 శాతంగా ఉంది. ఇక కేర‌ళ యువ‌తుల్లో 19 శాతం మంది డయాబెటిస్ బారిన ప‌డ‌గా, జాతీయ స్థాయిలో ఇది 11 శాతంగా ఉంది. దీంతో ఈ రెండు నివేదిక‌లు ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వైద్య నిపుణులు కూడా ఈ విష‌యంలో వీలైనంత త్వ‌ర‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెబుతున్నారు.

డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బుల వంటివి సాధార‌ణంగా లైఫ్ స్టైల్‌లో మార్పుల వ‌ల్లే వ‌స్తాయి. స‌రైన స‌మయానికి ఆహారం తీసుకోక‌పోవ‌డం, నిద్ర‌పోక‌పోవడం, వ్యాయామం చేయ‌కుండా ఉండ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని శ‌రీరానికి అస‌లు ప‌నిచెప్ప‌క‌పోవడం, ధూమ‌పానం, మ‌ద్యపానం ఎక్కువ‌గా చేయ‌డం, జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల లైఫ్ స్టైల్ వ్యాధులు వ‌స్తున్నాయి. అవి వ‌చ్చాక బాధ‌ప‌డ‌డం క‌న్నా రాక‌ముందే జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version