గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు మంచి నిద్రను పొందలేకపోతుంటారు. నెలలు దాటే కొద్ది నిద్ర ఒక సవాలుగా మారుతుంది. గర్భంలో పిండాశయం పెరిగే కొద్ది గర్భిణులు తక్కువగా నిద్ర పోతుంటారు. కడుపులో పిండం పెరగడం వల్ల పడుకోలేని పరిస్థితి నెలకొంటుంది. గర్భిణులు మంచి నిద్రను పొందాలనుకుంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి.
సమస్యలు..
1. గర్భం చివరి దశలో ఉన్నప్పుడు శిశువు గర్భం లోపల కదులుతూ ఉంటాడు. దీంతో నిద్రకు భంగం వాటిల్లుతుంది. లోపల ఉన్న బిడ్డ కదిలినప్పుడు ఆటోమెటిక్ గా నిద్ర లేస్తారు. మళ్లీ పడుకోవడానికి ట్రై చేసినా నిద్ర పట్టదు.
2. సహజంగా గర్భిణులు మానసిక ఒత్తిడికి లోనవుతారు. నార్మల్ డెలివరీ.. సీజిరియన్ అవుతుందనే ఆందోళన. బిడ్డ అడ్డం తిరుగుతాడనే భయం.. ఇలా అన్ని సమస్యలతో సతమతం అవుతుంటారు.
3. గర్భవతిగా ఉన్నప్పుడు వారి కాళ్లు తిమ్మిరెక్కడం సహజం. కొందరి కాళ్లు వాపుగా కనిపిస్తాయి. ఇలా కాలు తిమ్మిరెక్కినప్పుడు కూడా నిద్రకు భంగం వాటిల్లుతుంది. తరచూ మూత్ర విసర్జన సమస్య కూడా ఉంటుంది. చివరి దశలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటాయి.
4. మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు టీ, కాఫీ లాంటివి తాగేస్తుంటారు. వీలైనంత వరకు వాటిని దూరం పెట్టాలి. ఆహారపు అలవాట్లు కూడా ఓ సమస్యే. అందుకే ఒకేసారి తినకుండా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి.
జాగ్రత్తలు పాటించండిలా..
హార్మోన్ల ప్రభావం.. మానసిక ఒత్తిడి కారణంగా రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర పొందలేరు. కాబట్టి గర్భిణులు పాటించాల్సిన కొన్ని చిట్కాలు.
1.పడుకునే ముందు వేడి పాలను తాగండి. ఆరోగ్యంతోపాటు నిద్రకు మేలు చేస్తుంది. పిండి పదార్థాలను ఎక్కువగా తినండి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోండి. పగటి పూట ఆరోగ్యకరమైన చిరుతిండి.. రాత్రి పూట పండ్లు, లైట్ ఫుడ్ తీసుకోండి.
2. వీలైనంత వరకు ఆహారాన్ని ద్రవరూపంలోనే తీసుకోండి. గర్భ సమయంలో పిల్లలకు నీరు ఎంతో అవసరం. బిడ్డకు కావాల్సిన ఎనర్జీ కూడా ద్రవ రూపంలోనే చేరుతుంది.
3. ఒత్తిని తగ్గించుకునేందుకు తేలికపాటి యోగాసనాలు చేయండి. అప్పుడు మానసిక ఒత్తిడి నుంచి దూరమవుతారు. అలాగే పడుకోవడానికి ప్రత్యేక షెడ్యూల్ పాటించండి. టైం కేటాయించుకుని పడుకోవడం అలవాటు చేసుకోండి.
4. కాళ్లు తిమ్మిరెక్కినప్పుడు తాపన ప్యాడ్ లేదా వేడి నీటి సంచిని నొప్పి ఉన్న ప్రదేశాల్లో ఉంచండి. రోజూ వెచ్చని స్నానం చేయండి. ప్రశాంతంగా ఉంటూ.. మీకు నచ్చిన పని చేయండి. అప్పుడు మీకు హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.