మన శరీరంపై నిత్యం అనేక బాక్టీరియా, వైరస్‌లు దాడి చేస్తుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే మనం తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటాం. అయితే బాక్టీరియాను నిర్మూలించాలంటే.. యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్న పదార్థాలను తినడం ఎంత అవసరమో.. మనకు వ్యాపించే వైరస్‌లను నాశనం చేయాలంటే.. యాంటీ వైరల్ గుణాలు ఉన్న పదార్థాలను తినడం కూడా అంతే అవసరం.. ఈ క్రమంలోనే మన ఇండ్లలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ వైరల్ గుణాలు ఉన్న పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!
తులసి…
తులసిలో యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే తులసి ఆకులను తినడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో చేరే వైరస్‌లు నశిస్తాయి. తులసి ఆకులు దొరక్కపోతే తులసి హెర్బల్ ట్యాబ్లెట్లను కూడా తీసుకోవచ్చు. వీటిని డాక్టర్ సూచన మేరకు వాడుకోవాలి. నిత్యం 300 ఎంజీ మోతాదులో ఈ ట్యాబ్లెట్లను వేసుకోవాల్సి ఉంటుంది.
సోంపు గింజలు…
చాలా మంది భోజనం అనంతరం.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేందుకు సోంపు గింజలను తింటుంటారు. అయితే వీటిలో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వైరస్‌లు నశిస్తాయి. సోంపు గింజలను నిత్యం తింటే వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
వెల్లుల్లి…
వెల్లుల్లిలో యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం వెల్లుల్లి రెబ్బల్ని తినడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం రాకుండా చూసుకోవచ్చు. అలాగే వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పుదీనా…
పుదీనాలో యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నిత్యం పుదీనా ఆకులను తినాలి. లేదా పుదీనా ఆకులతో తయారు చేసిన టీ ని కూడా తాగవచ్చు. దీంతో శ్వాసకోశ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
అల్లం…
దగ్గు, జలుబు, ఫ్లూ తదితర వ్యాధులను తగ్గించే గుణాలు అల్లంలో ఉంటాయని సైంటిస్టులు చేసిన పరిశోధనలో వెల్లడైంది. అందువల్ల నిత్యం ఉదయాన్నే పరగడుపునే కొద్దిగా అల్లం రసం సేవిస్తే.. శ్వాసకోశ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
అశ్వగంధ…
నిత్యం అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోవడం వల్ల కూడా వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అశ్వగంధలో ఉండే యాంటీ వైరల్ గుణాలు మనల్ని వైరస్‌ల బారి నుంచి రక్షిస్తాయి.
వేప…
వేప ఆకుల్లోనూ యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. వేప ఆకులను కొద్ది మోతాదులో తీసుకుని చూర్ణం చేసి తీసుకున్నా లేదా.. రసం సేవించినా.. వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుంది.