నిద్రలో మాట్లాడటం నిజంగా అంత ప్రమాదకరమైన వ్యాధా..?

ప్రశాంతంగా నిద్రపోవడం అనేది వరంలాంటింది.. అది నిద్రలేమితో బాధపడేవారికే తెలుస్తుంది. అసలు నిద్రపోయేప్పుడు కొందరికి ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసా..? ఉన్నట్టుండి చెమటలు పడతాయి, ఊపిరాడదు, దాహం వేస్తుంది. కొందరు నిద్రలో నడుస్తారు, మరికొందరు ఏదేదో మాట్లాడతారు. ఇక ఇలా నడిచేవాళ్లు, మాట్లాడేవాళ్ల పక్కన పడుకుంటే..పక్కనోడికి పిచ్చిలేస్తుంది.! నిద్రలో ఎవరినో తిడతారు, కథలు చెబుతారు.. అసలు ఇలా ఎందుకు చేస్తారు, ఏదైనా వ్యాధా ఇది..?

మనిషి మనసులో దాగి ఉన్న బాధకు, రుగ్మతకు సంకేతమే ఇలా నిద్రలో మాట్లాడటం. అయితే ఇది ప్రమాదకరమైన సమస్య కానప్పటికీ…మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉందని వైద్యులు అంటున్నారు..ఎంతో మంది మానసిక వైద్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాబోయే మానసిక సమస్యలకు ఇవి సంకేతాలుగా కూడా చెప్పవచ్చట.

నిద్రలో మాట్లాడింది వారికి గుర్తుంటుందా?

నిద్రలో మాట్లాడేవారికి వారు ఏం మాట్లాడారో, ఎలా అరిచారో లేచాక పాపం వారికి గుర్తుండదు. పక్కవాళ్లు అడిగినా ‘అవునా’ అని ఆశ్చర్యపోతారు కానీ అసలు నమ్మలేరు. ఎప్పుడో ఓసారి మాట్లాడి వదిలేస్తే ఫర్వలేదు కానీ, కొంతమంది తరచూ నిద్రపోయాక ‘స్లీప్ టాక్’ చేస్తుంటారు. అలా చేస్తే దాన్ని సమస్యగానే గుర్తించాలి. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

దీన్ని అసలు ఏమంటారు..?

వైద్య పరిభాషలో ఇలా నిద్రలో మాట్లాడే విధానాన్ని ‘సోమ్నిలోకీ’ అంటారు. ఇదొక రకమైన పారాసోమ్నియా. అంటే నిద్రలో జరిగే అసాధారణ ప్రవర్తన అని అర్థం.. ఇది వైద్యపరమైన సమస్య కాకపోవచ్చ కానీ కచ్చితంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించినదే. స్లీప్ టాక్ అనేది 30 సెకన్ల పాటూ ఉంటుంది. కొన్ని సార్లు వారు ఏమంటున్నారో అర్థం చేసుకోవడం కూడా పక్కనవారికి అర్థంకాదు. అమెరికాలో దాదాపు 70 శాతం మంది ఇదే సమస్యతో బాధపడుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది.

కారణ్లాలు ఏమై ఉండొచ్చు..

REM స్లీప్ బిహేవియర్ డిజార్డర్, స్లీప్ టెర్రర్స్ నిద్రలో మాట్లాడటానికి ముఖ్య కారణాలు అని మానసిక నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి తీవ్రంగా మారితే నిద్రలో నడిచే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంతమంది ప్రజలు నిద్రలో అరుస్తూ, గుసగుసలాడుతూ, హింసాత్మకంగా కూడా ప్రవర్తిస్తారు. గాయాలు తగలడం, భావోద్వేగపరంగా ఒత్తిడికి గురవ్వడం, వివిద మానసిక రుగ్మతలతో బాధపడడం, డ్రగ్స్ వాడే అలవాటు ఉండడం ఇవన్నీ నిద్రలో మాట్లాడేందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక పిల్లల విషయానికి వస్తే వారు భయపడినప్పుడు ఎక్కువగా ఇలా జరుగుతుంది.

ఇలా చేయడం చాలా ప్రమాదకరం..

స్లీప్ టాకింగ్ అనేది పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన వ్యాధులతో ముడిపడి ఉందని చాలా అధ్యయనాలు అంటున్నాయి. కొంతమంది స్లీప్ టాకింగ్ లోనే పళ్లు కొరుకుతారు. స్లీప్ వాకింగ్ చేయడం వంటివి చేస్తారు. ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి. స్లీప్ అప్నియా వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది.. ఇలాంటి వారికి చికిత్స అవసరం. ఇలాంటి వారికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.