మన ఆరోగ్యంలో గుండె కీలక పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటేనే, మనం చురుకుగా, సంతోషంగా జీవించగలం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం సరైన ఆహారం ఎంత ముఖ్యమో, మనం వంటలో వాడే నూనె కూడా అంతే ముఖ్యం. నిజానికి, ఒక నూనె మన గుండెకు ‘హెల్త్ గార్డ్’ లా పనిచేస్తుంది. మరి ఆ అద్భుతమైన మన వంటగదిలోనే ఉండే ‘హార్ట్-ఫ్రెండ్లీ’ నూనె ఏంటో దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా..
గుండెకు మేలు చేసే ఆలివ్ నూనె: గుండె ఆరోగ్యానికి ఉత్తమంగా పనిచేసే నూనెలలో అగ్రస్థానం ఆలివ్ నూనె (Olive Oil) అని చెప్పచు. ముఖ్యంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అత్యంత శ్రేయస్కరమైనది. ఈ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఆలివ్ నూనెలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రక్త నాళాలు ఆరోగ్యంగా ఉండటానికి, రక్తపోటును నియంత్రించడానికి దోహదపడతాయి. అయితే వంటకు ఉపయోగించేటప్పుడు, ఆలివ్ నూనెను డీప్ ఫ్రైయింగ్‌కు కాకుండా, సలాడ్‌లపైన తక్కువ వేడితో వండే వంటకాలలో ఉపయోగించడం ఉత్తమం.

దినచర్యలో భాగం చేసుకోండి!: ఆలివ్ నూనెను కేవలం ఆరోగ్య ప్రయోజనాల కోసమే కాకుండా, దాని ప్రత్యేకమైన రుచి కోసం కూడా వాడుకోవచ్చు. మీరు ఉదయం సలాడ్ చేసుకున్నప్పుడు, రాత్రి కూరగాయలతో కూడిన సూప్ చేసుకున్నప్పుడు చివరగా ఒక చెంచా ఆలివ్ నూనె వేసుకోవచ్చు. ఇది మీ ఆహారానికి అదనపు పోషణను, రుచిని ఇస్తుంది.
మనం ఆలోచించాల్సిన విషయం ఆరోగ్యకరమైన గుండె కేవలం ఒక్క నూనెతోనో, ఒక్క ఆహారంతోనో రాదు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి కలయికతోనే సాధ్యమవుతుంది.
గమనిక: ఆలివ్ నూనె ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దాన్ని మితంగా ఉపయోగించాలి. అలాగే గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య లేదా వైద్యపరమైన మార్పులు చేయాలనుకుంటే, తప్పనిసరిగా మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించి, వారి సలహా మేరకు పాటించడం ఉత్తమం.
