గ్రీన్ టీ తాగడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. గ్రీన్ టీ వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు మాత్రం గ్రీన్ టీని తప్పకుండా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే…
గ్రీన్ టీలో కాటెకిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక బరువు తగ్గేందుకు తోడ్పడుతాయి. బీపీని తగ్గిస్తాయి. శరీరం కార్పొహైడ్రేట్లను త్వరగా జీర్ణం చేయకుండా, త్వరగా శోషించబడకుండా చూస్తాయి. దీంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. బరువు తగ్గడం వల్ల సహజంగానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. గ్రీన్ టీ వల్ల బరువు తగ్గుతారు. కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి మన శరీరంలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా వినియోగం అవుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అందుకనే నిత్యం 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే గ్రీన్ టీ శరీరానికి మంచిదే అయినప్పటికీ గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు, కెఫీన్ అలర్జీ ఉన్నవారు.. దీన్ని మితంగా తీసుకోవాలి. లేదా సమస్య అనిపిస్తే మానేయాలి. వారు తప్ప ఎవరైనా సరే గ్రీన్ టీని నిత్యం తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు షుగర్ లెవల్స్ ను కూడా అదుపులో ఉంచుకోవచ్చు.