బరువు పెరిగిన తర్వాత తగ్గినవారికి, గర్భం దాల్చినవారికి శరీరంపై స్ట్రెట్ మార్క్ ఏర్పడతాయి. ఇవి అబ్బాయిలకు ఉన్నా పెద్ద తేడా ఏం ఉండదు. కానీ మహిళలకు పొట్టపై ఉండటంతో చీరలు కట్టినప్పుడు ఇబ్బందిపడుతారు.వాటిని తొలగించుకోవడానికి మార్కెట్‌లో వివిధరకాలు క్రీమ్స్ ఉన్నప్పటికి అందులో ఏది కెమికల్ ఫ్రీ అని మనం చెప్పలేం. కొండనాలుకకు మందువేస్తే..ఉన్న నాలుక పోయినట్లు..ఈ స్ట్రెచ్ మార్క్ పోవడానికి క్రీమ్స్ రాస్తే..వాటివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. వీటిని తొలగించుకోవటానికి కొన్ని సులభమైన చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనె : స్ట్రెచ్ మార్క్‌లను పోగొట్టడంలో కొబ్బరి నూనె అద్భుతంగా పని చేస్తుంది. పగలు లేదా రాత్రి పడుకునే ముందు అయినా కొబ్బరి నూనెను అప్లై చేయొచ్చు. కొబ్బరి నూనెతో రోజూ మసాజ్ చేస్తే అధ్బుతమైన ఫలితాలు ఉంటాయి. కేవలం ఈ సమస్యకే కాదు..కొబ్బరినూనే చర్మంపై ఏర్పడిన మట్టిని తొలగించటంలోనూ బాగా పనిచేస్తుంది. స్నానానికి ముందు కొబ్బరినూనే రాసుకుని బాగా మర్దనా చేసుకుని..స్నానం చేస్తే..మురికి అంతా పోయి..చర్మం నిగారిస్తుంది. ఇది మీ చర్మానికి పోషణ, తేమను అందించడంలో సహాయపడుతుంది.
అలోవెరా : కలబంద మీ చర్మ సంరక్షణకు గొప్ప పదార్థంగా పని చేస్తుంది. దీని గురించి మహిళలకు ఎక్కువగా చెప్పనక్కర్లేదు. రకరకాల సమస్యలకు ఇది బాగా పనిచేస్తుంది. అలోవెరా ఆకు నుండి తాజా జెల్ తీసుకొని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. దీన్ని రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కోకో బటర్: కోకో బటర్ ప్రధానంగా చాలా క్రీములలో ఉపయోగించబడుతుంది. ఇది స్ట్రెచ్ మార్కులను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుందట. రాత్రి పడుకునే సమయంలో కోకో బటర్‌ను స్ట్రెచ్ మార్క్‌లపై అప్లై చేయాలి. బాగా మసాజ్ చేసి ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా స్ట్రెచ్ మార్కులను తొలగించడంలో అద్బుతంగా పని చేస్తుంది. ఇది సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇది మృతకణాలను తొలగించటంలో బాగా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమం స్ట్రెచ్ మార్క్‌లపై అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ తరువాత క్లీన్ చేయండి… రోజూ ఇలా చేయడం ద్వారా అద్భుతం ఫలితం కనిపిస్తుంది.
దోసకాయ, నిమ్మరసం : నిమ్మరసం మచ్చలను తొలగించటంలో ఎంతబాగా పనిచేస్తుందో మనకు తెలుసు..దోసకాయ మీ చర్మాన్ని చల్లబరుస్తుంది. నిమ్మరసం, దోసకాయ రసాన్ని సమాన భాగాలుగా కలపి స్ట్రెచ్ మార్క్‌పై అప్లై చేయాలి. చర్మంపై కాసేపు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మీరు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
వీటిలో మీకు సులువైన చిట్కా ట్రై చేసేయండి మరీ..!