స్త్రీల ఆరోగ్యం అనగానే మనం తరచుగా రుతుక్రమం గర్భధారణ, మెనోపాజ్ వంటి వాటి గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. కానీ చాలా మంది మహిళలు ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సమస్య గురించి మాత్రం మనం మాట్లాడటానికి వెనుకాడతాం. అదే ఫిమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్ (FSD). ఇది ఒక రకమైన శారీరక మానసిక సమస్య. ఇది స్త్రీల లైంగిక ఆసక్తిని, ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది. దీని గురించి బయటకు చెప్పడానికి చాలా మంది సిగ్గుపడతారు భయపడతారు. అయితే ఈ సమస్య గురించి తెలుసుకోవడం దానిని అంగీకరించడమే దీనిని అధిగమించడానికి తొలి అడుగు. ఎందుకంటే దీనికి సరైన పరిష్కారాలు ఉన్నాయి. మరి ఈ సమస్య గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ..
FSD అంటే ఏమిటి: FSD అనేది స్త్రీలలో లైంగిక కోరిక, ఉత్తేజం, లైంగిక సంపర్కం సమయంలో ఆనందం లేకపోవడం లేదా నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్య శారీరక కారణాలైన హార్మోన్ల అసమతుల్యత మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల మందుల వాడకం వల్ల రావచ్చు. మానసిక కారణాలైన ఒత్తిడి ఆందోళన, డిప్రెషన్, గతంలో జరిగిన లైంగిక వేధింపుల వంటి వాటి వల్ల కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు.
లక్షణాలు: FSD లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని సాధారణ లక్షణాలు చుస్తే ఎక్కువ మంది మహిళల్లో లైంగిక కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం. లైంగిక సంపర్కం సమయంలో తగినంత ఉత్తేజం పొందలేకపోవడం. లైంగిక సంపర్కం సమయంలో నొప్పి లేదా అసౌకర్యం కలగడం. లైంగిక సంపర్కం తర్వాత ఆర్గాసమ్ పొందడంలో ఇబ్బందులు.

నివారణ, చికిత్స: FSD నివారణకు చికిత్సకు అనేక మార్గాలు ఉన్నాయి. మొదట ఈ సమస్య గురించి వైద్యుడితో మాట్లాడటం చాలా ముఖ్యం. వైద్యులు శారీరక, మానసిక కారణాలను గుర్తించి తగిన చికిత్స సూచిస్తారు. చికిత్సలో హార్మోన్ థెరపీ, కౌన్సిలింగ్, లైంగిక థెరపీ, యోగా ధ్యానం వంటివి ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
ఫిమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్ (FSD) అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య, దీనిని సరిగ్గా తెలుసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఈ సమస్య గురించి బహిరంగంగా మాట్లాడటం, వైద్య సహాయం తీసుకోవడం ద్వారా అనేక మంది మహిళలు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఇది కేవలం ఒక శారీరక సమస్య కాదు, దీనికి మానసిక, భావోద్వేగ మద్దతు కూడా అవసరం.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.