మనుషులకు వ్యాక్సిన్స్ వేయడం చూశాం., కుక్కలకు, పిల్లలకు వ్యాక్సిన్స్ వేయడం చూశాం కానీ..తేనెటీగలకు వ్యాక్సన్ వేయడం మీరెప్పుడైనా విన్నారా..? తేనెటీగల ఆరోగ్యంపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయని.. పరాన్నజీవులు, కీటకాలు, వ్యాధులు, ఏకంగా గుంపులుగుంపులు ఒకేసారి చనిపోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియా వ్యాధులు వంటివన్నీ వాటి మరణానికి కారణమవుతున్నట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్డీఏ) చెప్పింది.
‘అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్’ నుంచి తేనెటీగలు మృత్యువాత పడకుండా ఈ వ్యాక్సీన్ కాపాడుతుందట..(యూఎస్డీఏ) ఈ వ్యాక్సీన్‌కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్లు దీని తయారీ సంస్థ యలాన్ యానిమల్ హెల్త్ వెల్లడించింది. మొక్కల్లో పరాగ సంపర్కానికి సహకరించే జీవులుగా పర్యావరణంలో తేనెటీగల పాత్ర కీలకంగా ఉంటుంది..‘తేనెటీగలను బతికించడానికి ఈ వ్యాక్సీన్ కీలకం కానుంది’ అని డలాన్ యానిమల్ హెల్త్ సీఈవో అన్నెట్ క్లైజర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రపంచంలోని పంట ఉత్పత్తులలో మూడో వంతుకు కారణం పరాగ సంపర్కానికి తోడ్పడే తేనెటీగలు. పక్షులు, గబ్బిలాలు వంటివేనని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్తోంది. కాగా అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్ కారణంగా తేనెటీగల పెంపకందారులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు.. ఇంతవరకు ఈ వ్యాధికి చికిత్స అనేదే లేదు. అంతేకాదు… ఇది చాలావేగంగా వ్యాపించే వ్యాధి. ఈ వ్యాధి వచ్చినట్లు గుర్తిస్తే తేనెటీగలను పెంచే పెట్టెలు, ఈగలు అన్నిటినీ మంటల్లో కాల్చడమే దీనికి పరిష్కారం.. అలా చేస్తే మిగతావాటికి వ్యాపించకుండా ఆగేది.
ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సీన్లో అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్‌కు కారణమయ్యే ‘పేనిబాసిల్లస్ లార్వా’ బ్యాక్టీరియానే వాడుతారు. అయితే, అచేతన స్థితిలో ఉండే బ్యాక్టీరియా వ్యాక్సీన్లో ఉంటుందని డలాన్ యానిమల్ హెల్త్ చెప్పింది.
తేనెతుట్టెలోని శ్రామిక ఈగలు రాణి ఈగకు అందించే ఆహారం రాయల్ జెల్లీలో వ్యాక్సీన్ ద్వారా ఈ బ్యాక్టీరియాను ఎక్కిస్తారు. ఆ ఆహారం ద్వారా రాణి ఈగకు అందే రోగనిరోధక బ్యాక్టీరియా దాని అండాశయాలలోకి చేరుతుందని వ్యాక్సీన్ తయారీ సంస్థ చెప్పింది. రాణి ఈగ అండాశయాలలోకి వ్యాక్సీన్ చేరడం వల్ల అది లార్వాకు రోగనిరోధక శక్తిని కలిగిస్తుందని.. దానివల్ల కొత్తగా జన్మించే ఈగలు ఈ వ్యాధిని తట్టుకోగలుగుతాయట.
ఈ కొత్త వ్యాక్సీన్ తేనెటీగల పెంపకందారులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు కాలిఫోర్నియా రాష్ట్ర తేనెటీగల పెంపకందారుల సంఘం సభ్యుడు ట్రెవర్ టౌజర్ చెప్పారు. వ్యాక్సీన్ ఈ ఏడాదే పరిమిత సంఖ్యలో అందుబాటులోకి రానుందని తయారీ సంస్థ డలాన్ వెల్లడించింది.